Shiva Balakrishna Assets: హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హెచ్‌ఎండీఏ(HMDA) మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ(Shiva Balakrishna)పై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన ఇంట్లో భారీ ఎత్తున నగదు, బంగారం, ఖరీదైన వాచీలు, మొబైల్స్ గత వారం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో తెలంగాణ ప్రభుత్వం శివబాలకృష్ణను సర్వీస్ నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పదవిని అడ్డుకుని వందల కోట్లు సంపాదించారని ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఇప్పుడు ఈకేసు ఒక్క శివబాలకృష్ణతో పోవడం లేదు. ఆయన దగ్గర పని చేసే అధికారుల మెడకి కూడా చుట్టుకుంటోంది. ఆయనతో పని చేసే అధికారులను కూడా ఏసీబీ అధికారులు విచారించనున్నారు. దీనిపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మొదటి నుంచి ఆయనతో కలిసి పని చచేసే ఉద్యోగులందరికీ నోటీసులు ఇచ్చారు. వారిని విచారించి ఇంకా పూర్తి వివరాలు రాబట్టనున్నారు. ఇప్పటికే శివ బాలకృష్ణకు సంబంధించిన నివాసాల్లో సోదాలు చేశారు. ఆయన బినామి ఆస్తులు కూడా గుర్తించారు. బినామీలను సైతం విచారించి మరింత మందిని అదుపులోకి తీసుకోనున్నారు. ఇప్పుడు ఆయనతో పని చేసే ఉద్యోగులను విచారిస్తే ఇంకా ఎన్ని సంచలనాలు బయటకు వస్తాయో అన్న ఆసక్తి నెలకొంది. ఆయన బ్యాంకు ఖాతాలు, లాకర్లు అన్నింటినీ సీజ్ చేశారు. ఆయన్ని కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
6 నెలల క్రితమే రెరాకు బదిలీ
శివ బాలకృష్ణ అవినీతి వ్యవహారాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. హైదరాబాద్ మున్సిపల్ డెవలప్ మెంట్ అథారిటీ (Hmda) డైరెక్టర్‌గా పని చేసిన శివ బాలకృష్ణ… 6 నెలల క్రితమే రెరాకు బదిలీపై వెళ్లారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రణాళిక విభాగం అధికారిగా పనిచేసిన శివబాలకృష్ణపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. వందల కోట్ల రూపాయలను ఆస్తులను గుర్తించిన ఏసీబీ… శివబాలకృష్ణను కొన్ని రోజుల కిందట అరెస్ట్ చేసింది. ఆయన కనుసన్నల్లో ఆమోదం పొందిన భూముల వ్యవహారాలపై దృష్టి సారించింది. నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల ఆమోదం తదితర అంశాలపై ఫైళ్లను స్థూలంగా పరిశీలించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
గత వారం ఏసీబీ దాడుల్లో బాలకృష్ణకు సంబంధించి ఏకంగా వందల కోట్లకుపైగా ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించారు. హెచ్‌ఎండీఏ పరిధి జోన్లలోని నిబంధనల్ని తనకు అనుకూలంగా మలుచుకుని వందల దరఖాస్తులను ఆమోదించేందుకు భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డాడని అభియోగాలు ఉన్నాయి. అతడి ఇంట్లో ఖరీదైన ఫోన్లు, వాచీలు, లగ్జరీ వస్తవులు కనిపించడం చూసి అధికారులు షాకయ్యారు.
ఏసీబీ కోర్టులో శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్అయిన తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కార్యదర్శి శివ బాలకృష్ణ (ShivaBalakrishna) ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని శివ బాలకృష్ణ తరఫు లాయర్ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధికారులు గుర్తించామని చెబుతున్నట్లుగా అభియోగాలలో పేర్కొన్నంత ఆదాయం, ఆస్తులు లేవని పిటీషన్‌లో పేర్కొన్నారు.