ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి కోపం వచ్చింది. మంత్రిగా ఫోన్ చేస్తే, ఎవరని ప్రశ్నించిన తన శాఖకు చెందిన ఉన్నతాధికారిపై ఆయన బదిలీ వేటు వేయడం చర్చనీయాంశమైంది. బదిలీ వేటుకు ఆర్టీసీ కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) గిడుగు వెంకటేశ్వరరావు గురి కావడం గమనార్హం.
అయితే ఈడీ బదిలీకి మరో కారణాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించినా, పట్టించుకోకపోవడంతోనే వేటు వేశారని చెబుతున్నారు. కానీ అసలు విషయం వేరే. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఈడీకి పలుమార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోలేదని టీడీపీ నేతలు అంటున్నారు. అలాగే ఒకసారి రిసీవ్ చేసుకుని, ఎవరని ఈడీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారని సమాచారం.
మంత్రి అయిన తన సెల్ నంబర్‌ను దగ్గర పెట్టుకోకపోవడంతో పాటు ఎవరని ప్రశ్నించడాన్ని మంత్రి జీర్ణించుకోలేకున్నారు. దీంతో కడప జోన్ ఈడీపై వైసీపీ ముద్ర వేసి, ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది.
మంత్రి ఫోన్ చేస్తే ఎవరని ప్రశ్నించడం ఏంటని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. ఇలాంటి అధికారిని సొంత జిల్లాలో పెట్టుకుని ఎలా పని చేయించుకోవాలని టీడీపీ ప్రశ్నించడం గమనార్హం. ఈడీపై బదిలీ వేటు మిగిలిన ఉద్యోగులకు ఒక హెచ్చరికగా అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు.