తెలంగాణకు హోం మంత్రి కావలెను.. ఇదే ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న ఒక ట్రెండ్..! కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి దాదాపు 200 రోజులు అవుతున్నా.. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం గమనార్హం. తొమ్మిదిన్నరేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల శాంతిభద్రతలు క్షీణించాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అంతేకాదు.. ఎక్కడ చూసినా ఘర్షణలు, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని వెంటనే హోం మంత్రిని నియమించాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది.
గత ఆరు నెలలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు తెలంగాణకు హోం మంత్రి లేరని.. రాష్ట్రానికి ఈ పరిస్థితి ఎందుకొచ్చిందని సామాన్యుడు సైతం ప్రశ్నిస్తున్న పరిస్థితి. ప్రజల భద్రతను పట్టించుకునే దిక్కే లేదని.. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో ఒక్కరోజులోనే నాలుగైదు హత్యలు జరగడంతో భాగ్యనగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి తోడు రక్షించాల్సిన ఖాకీ బట్టలేసుకున్న ఉన్నతాధికారులు మహిళా పోలీసులపట్ల విచిత్రంగా ప్రవర్తిస్తుండటం.. భయపెట్టి అత్యాచారాలు చేసిన ఘటనలు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. దీంతో ఆ మహిళలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ప్రజల భద్రతను పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది.
విద్యాశాఖ మంత్రి కూడా లేరే..!
ప్రభుత్వం ఏర్పడి ఇన్నిరోజులు అవుతున్నా.. స్కూల్స్ తిరిగి ప్రారంభం అవుతున్నా ఇంతవరకూ విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఎంత సిగ్గు చేటు చూడండి. నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైంది.. కానీ విద్యాలయాల అవసరాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల బాగోగులు పట్టించుకునే నాథుడే లేడు. అందుకే హోం శాఖతో పాటు విద్యాశాఖ మంత్రి కూడా కావాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. కనీసం ఏదైనా ఫలితాలు రిలీజ్ చేయడానికి కానీ.. విద్యాశాఖ పరంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మంత్రి లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.
విద్యాశాఖ అనేది ఎంతటి కీలక శాఖ అనేది రేవంత్ రెడ్డికి తెలుస్తోందా లేదా అని.. ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. అయినా ఈ రెండు కీలక శాఖలకు మంత్రులు లేకుండా ఇన్నిరోజులు రాష్ట్రాన్ని నడపడం ఎందుకో ఏంటో..! అయినా రెండు శాఖలు ఎవరో ఇద్దరికి అదే సంబంధిత శాఖల పట్ల పట్టు, అవగాహన ఉన్న వారికి కట్టబెడితే పోయేదేముంది..? 200 రోజులు అవుతున్నా.. రాష్ట్రంలో గొడవలు, హత్యలు జరుగుతున్నా.. విద్యాశాఖలో పుస్తకాలపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా కనీసం చీమ కుట్టినట్లుగా కూడా ప్రభుత్వానికి లేకపోవడం ఎంతవరకు సమంజసమో మరి.