కడుపు నిండితే ఖర్జాయం కూడా చేదే అనిపిస్తుందనేది ఒక సామెత! బీజేపీ ఎంత మత వచనాలు పలికినా.. ఉత్తరాది హిందువులకు కూడా ఆ పార్టీ అంటే మొహం మొత్తం మొదలైంది. 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలే అందుకు నిఖార్సైన ఉదాహరణ. 370తో కౌంట్ మెదలు పెట్టుకోండి.. 400 క్రాస్ అవుతుంది అంటూ బీజేపీ నేతలు ప్రచారం తీవ్ర స్థాయిలో హోరెత్తిస్తే, ఔను అదే నిజం అంటూ ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ లు, అధ్యయనాలు, మూడ్ ఆఫ్ ద నేషన్లు మొత్తుకుంటే.. చివరకు అలాంటివి ఏమీ నిజం కాలేదు!
వరసగా రెండు సార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి మెజారిటీ సొంతంగా తెచ్చుకున్న బీజేపీ ఈ సారి మిత్రుల మీద అందునా.. ఎప్పుడు ఎటు గెంతుతారో తెలియని నితీష్ కుమార్, చంద్రబాబు లాంటి వాళ్ల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. పాట 370తో మొదలుపెట్టారు కాబట్టి.. కనీసం భక్తుల్లో అయినా ఆ నమ్మకాలు ఏర్పడి కొంత సీట్ల సంఖ్య పెరిగి ఉండవచ్చు. మీడియా మొత్తం కాపు కాసింది కాబట్టి సరిపోయింది.. లేకపోతే ఈ మాత్రం సీట్లు అయినా బీజేపీకి దక్కేవా అనేది ప్రశ్నార్థకమే!
అధికారం తిరుగులేని స్థాయిలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలూ పైకి బయట పడని రీతిలో బీజేపీ పరిస్థితి కనిపించింది. అయితే లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు నెలల్లోపే యూపీ బీజేపీలో రచ్చలు రేగాయి. అక్కడ బీజేపీలో ముసలం ఏదో మొదలైనట్టుగా ఉంది. మోడీకి తిరుగులేదన్నట్టుగా జరిగిన ప్రచారమే ఇన్నాళ్లూ యోగి విషయంలో కూడా జరిగింది. ఇక యోగి తదుపరి టార్గెట్ ప్రధాని పీఠమే అని భక్తులే మురిసిపోయారు. అయితే ఇప్పుడు యూపీలోనే రాజకీయ వేడి రేగింది. మరి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని యూపీ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. సమాజ్ వాదీకి పట్టం గట్టారు. కాంగ్రెస్ కు కొన ఊపిరిని పోశారు.
లోక్ సభ ఎన్నికల విషయంలో మోడీ, ప్లస్ యోగి ఇమేజే బీజేపీని అక్కడ 33 సీట్లకు పరిమితం చేసింది. మరి అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం భక్తులకు కలవరపాటుగా మారిన వేళ ఇప్పుడు అక్కడే బీజేపీలో ముసలం ఏదో బయల్దేరిందంటే ఇది మరింత ఇబ్బందులను తెచ్చి పెట్టే అవకాశం ఉంది. ఈ సారి ఎటు తిరిగి యూపీలో అధికారం తమదే అనే విశ్వాసంతో ఎస్పీ కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ తో కలిసి బరిలోకి దిగుతామని ఎస్పీ ప్రకటిస్తోంది. యూపీ ఎన్నికల్లో గనుక బీజేపీ కి ఎదురుదెబ్బ తగిలిందంటే.. జాతీయ స్థాయిలో ఆ పార్టీ మళ్లీ 2014 నాటి మునుపు పరిస్థితులు ఎదురవ్వడం లో వింత లేదు!
యూపీ ఎన్నికలకు అయినా ఇంకా కాస్త టైమ్ ఉంది. ఇంతలోనే మహారాష్ట్ర ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ బీజేపీ చేసిన వ్యవహారాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడా లోక్ సభ ఎన్నికల్లో గట్టి ఝలక్కే తిగలింది. దేశానికి వాణిజ్య రాజధాని అనదగ్గ ముంబైని కలిగి ఉన్న మహారాష్ట్రలో రాజకీయ పట్టును నిలుపుకోవడానికి బీజేపీ తగని చేష్టలన్నీ చేసింది. శివసేనను చీల్చింది, ఎన్సీపీని చీల్చింది, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారందరినీ చేర్చుకుని రాత్రికి రాత్రి వారికి రాజ్యసభ సభ్యత్వాలను ఇచ్చింది.
వారెవరయ్యా అంటే.. 2014కు ముందు ఎవరైతే తీవ్ర అవినీతి పరులు, సైనికుల స్థలాలు కొట్టేశారు, దేశానికి వీరు చీడలాంటి వారు అంటూ ప్రచారం చేసి బీజేపీ జాతీయ స్థాయిలో ప్రయోజనం పొందిందో అలాంటి వారిని కూడా బీజేపీ చేర్చుకుందంటే ఎంతటి తెగింపో అర్థం చేసుకోవచ్చు! మహారాష్ట్రలో కూటమి కట్టి అయినా బీజేపీపై ప్రతీకారం తీర్చుకోవాలనే కసి వైరి పక్షాల్లో కనిపిస్తూ ఉంది. పాలనపై వ్యతిరేకతకు తోడు.. చేసిన రాజకీయాలే బీజేపీని మరింత ఎక్కువగా దెబ్బతీస్తూ ఉన్నాయనడంలో ఆశ్చర్యం లేదు.
ప్రస్తుతానికి అయితే మహారాష్ట్ర, యూపీల్లో బీజేపీకి డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్ లలో పరిస్థితులు అంతా కంట్రోల్లోనే కనిపిస్తూ ఉన్నాయి. ఆయా రాష్ట్రాలను బీజేపీ అధినాయకత్వం ఢిల్లీ నుంచి డైరెక్టుగా పాలిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్లను చెప్పాలన్నా.. గూగుల్ లో సెర్చ్ చేసుకోవాలి. గతంలో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వతహా గా నాయకులనే పేరుండేది. అలాంటి వారిని పక్కన పెట్టి.. అధిష్టాన నియామకాల మేరకే ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పేర్లున్నాయి.
ఏ పార్టీ అయినా సుదీర్ఘ కాలం పాలనలో కొనసాగాలంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం అయ్యే పని కాదు! దీనికి మోడీ కూడా మినహాయింపు కాదని 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు సూఛాయగా చెప్పాయి. మరి ఇంకో ఐదేళ్లకు జరిగే ఎన్నికల్లో అప్పుడు 15 సంవత్సరాల పాలనా వ్యతిరేకతను బీజేపీ ఎదుర్కొనాల్సి ఉంటుంది. అప్పుడు ప్రజలు మరేం చూడకుండా ప్రత్యామ్నాయం వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఏం చేస్తోంది అనే దాని కన్నా..బీజేపీ చేస్తున్నదాన్ని బట్టి.. ప్రజలు యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ తో కాంగ్రెస్ కు ఇంకో ఐదేళ్లకు అయినా జాతీయ స్థాయిలో పట్టం గట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి! 15 యేళ్లంటే 80 యేళ్లలోపు ప్రజాస్వామ్య దేశంలో చాలా ఎక్కువ సమయం మరి!
-హిమ