జులై 1న పెంచిన పెన్షన్లు పంపిణీ
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పెన్షన్ పంపిణీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో పాటు ఎన్నికల హామీ మేరకు పెన్షన్లను పెంచారు. గత ప్రభుత్వం రూ.3,000 పెన్షన్ ఇస్తే దాన్ని రూ.4,000కి పెంచింది. అలాగే గత మూడు నెలలు ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా రూ.1,000 చొప్పున, జులైలో నెల రూ.4,000, గత మూడు నెలల రూ.3,000 మొత్తం రూ.7,000 ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. మొత్తం 11 కేటగిరీల్లో పెన్షన్ రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచారు. వికలాంగులకు, మల్టీడిఫార్మిటీ లెప్రసీలకు పెన్షన్ రూ.3,000 నుంచి రూ.6,000కు పెంచారు. పక్షవాతంతో ఉన్నవారికి, తీవ్రమైన మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు, ప్రమాద బాధితులు పెన్షన్ రూ.5,000 నుంచి రూ.15,000కు పెంచారు. కిడ్నీ, తలసేమియా మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల్లో ఐదు కేటగిరీల్లో రూ.5,000 నుంచి రూ.10,000కి పెంచారు.