ByGanesh
Mon 11th Mar 2024 04:33 PM
ఉద్యమ కాలంలోనూ.. అనంతరం దశాబ్ద కాలం పాటు ఎదురు లేని పార్టీగా బీఆర్ఎస్ కొనసాగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైట్ హ్యాండ్ కాంగ్రెస్‌లోకి జంప్ అవనున్నారని టాక్. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ పూర్తిగా నేలకొరిగింది. పార్టీలో ఉండేదెందరో.. పోయేదెందరో తెలియకుండా ఉంది. పార్టీకి అండగా నిలిచిన వారు సైతం ఇటీవలి కాలంలో గట్టు దాటడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండగా.. నేతలంతా వరుసబెట్టి పార్టీకి దూరమవుతున్నారు. మరోవైపు మునిసిపాలిటీలన్నీ ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ఖాతాలో పడుతున్నాయి. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పథకాలతో ప్రజలంతా ఆ పార్టీకి వన్‌సైడెడ్‌గా మద్దతిస్తున్నారు.
కాంగ్రెస్‌లోకి కేకే?
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్న బీఆర్ఎస్ చివరకు బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. బీజేపీ తూచ్ అనే వరకూ గత్యంతరం లేని పరిస్థితుల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. అసలు బీఆర్ఎస్ రేంజ్ ఏంటి? బీఎస్సీతో పొత్తు పెట్టుకోవడమేంటని తెలంగాణ ప్రజానీకం విస్తుబోయింది. ఉద్యమ పార్టీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందా? అని ముక్కున వేలేసుకున్నారు. ఇక ఇప్పుడు కేసీఆర్‌కు నమ్మిన బంటుగా.. కుడి భుజంగా ఉన్న కే కేశవరావు సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనున్నారట. ముందుంగా ఆయన కూతురు గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లోకి వెళతారట. ఆ వెంటనే కేకే కూడా సొంత గూటికి చేరుకుంటారట. ఒకప్పుడు కేకే కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. ఆ తరువాత బీఆర్ఎస్‌లో చేరారు.
బీఆర్ఎస్‌కు విషమ పరీక్షే..
ఇప్పుడు కేకే సైతం కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారంతో బీఆర్ఎస్‌లో తీవ్ర కలకలం రేగింది. పార్టీలోని నేతలంతా ఆలోచనలో పడ్డారు. పార్టీ దాదాపు పతనం అంచున ఉంది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్‌లోనే కొనసాగితే భవిష్యత్ ఉండదని భయపడుతున్నారు. మొత్తానికి రానున్న పార్లమెంటు ఎన్నికలు బీఆర్ఎస్‌కు విషమ పరీక్షే. నిన్న మొన్నటి వరకూ రెండు సీట్లకు పరిమితమవుతుందని అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ రెండు సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి. ఇప్పటి వరకూ పెద్దగా బయటకు రాని ఆయన ఇక తప్పక బయటకు రావాల్సిందే. లేదంటే పార్టీ మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
A tough test for BRS:
KK into Congress?