Clay Fridge and Cooler: వేసవికాలం వచ్చిందంటే అందరూ మండుతున్న ఎండల కారణంగా ఉక్కపోతతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. పైగా అదిలాబాద్ జిల్లాలో ఈ మార్చి నెల ప్రారంభంలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఇళ్లలో ఫ్రిడ్జ్ లు కూలర్ ల వాడకం అనివార్యమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో కరెంటు లేకుండా మట్టితో తయారు చేసిన ఫ్రిడ్జ్ ఒకటి అందరినీ ఆకట్టుకుంటోంది. ఏంటి మట్టితో తయారు చేసిన ఫ్రిడ్జ్ అని ఆశ్చర్యపోతున్నారా..? ఫ్రిడ్జ్ ఒకటే కాదు.. కూలర్ కూడా ఉంది. అవును నిజమే.. మరీ ఇంకెందుకు ఆలస్యం.. ఈ మట్టి ఫ్రిడ్జ్ ని, కూలర్ ను ఎలా వినియోగిస్తున్నారో చూసేద్దాం రండి.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేసీబీ గార్డెన్ సమీపంలో గల భగవతి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న కన్నం మోహన్ బాబు అనే రిటైర్డ్ ప్రిన్సిపాల్ తన ఇంట్లో ఈ మట్టితో తయారు చేసిన ఫ్రిడ్జ్ నీ, కూలర్ ను వినియోగిస్తున్నారు. ఇవే కాకుండా ఆరోగ్యానికి మేలనీ, మట్టి పాత్రలను సైతం వినియోగిస్తున్నారు. ఈ మట్టితో తయారు చేసిన ఫ్రిడ్జ్ నీ, గుజరాత్ నుండి తెప్పించి గత రెండేళ్లుగా వాడుతున్నారు. వారి వాడకాన్ని చూసిన స్థానికులు ఆరోగ్యానికి మేలనీ తెలుసుకొని వారు సైతం తెప్పించి వాడుతున్నారు. ఇలా ఒక్కోక్కరుగా తెలుసుకుంటూ అడగడంతో కన్నం మోహన్ బాబు రిటైర్డ్ అయ్యాక పనేమీ లేదనీ, ఇదే పని చేస్తే పోలే అని మెల్ల మెల్లగా చిన్నపాటి ఉపాధి అనీ మట్టి పాత్రల దుకాణాన్ని సైతం ఏర్పాటు చేశారు.
దుకాణం ఏర్పాటు
గుజరాత్, రాజస్థాన్, కలకత్తా నుండి ఈ మట్టి పాత్రలు వస్తువులు తెప్పించి వీరి ఇంటిలోనే మట్టి పాత్రల దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మట్టితో తయారుచేసిన ఈ ఫ్రిడ్జ్ ని కూలర్ ను వాడుతూ మట్టి పాత్రలలోనే వంటకాలు చేసుకుంటూ ఆరోగ్యానికి మేలని వీటిని వినియోగిస్తున్నారు. వీరి వద్ద అనేక రకాల మట్టి పాత్రలు గ్లాసులు బాటిల్లు ఫ్రిడ్జ్‌లు, కూలర్లు, కుక్కర్లు ఇలా అనేక రకాల వస్తువులు ఉన్నాయి. కన్నం మోహన్ బాబు ఆయన సతీమణి సుజాత ఏబీపీ దేశంతో మాట్లాడుతూ మట్టితో తయారు చేసిన ఫ్రీడ్జ్, కూలర్, మట్టి పాత్రల గురించి వివరించారు.
ఫ్రిడ్జ్ పైన 10 లీటర్ల నీళ్ల ట్యాంక్
ఈ మట్టి ఫ్రిడ్జి గుజరాత్ రాష్ట్రంలో తయారు చేసిందని మట్టితో సున్నం ఇతర కొన్ని మిశ్రమాలతో దీన్ని తయారు చేశారని, మూడు వైపులా గోడలు ఉండి పైన పది లీటర్ల నీటి ట్యాంకు లోపల కూరగాయలు ఇతర వస్తువులు పెట్టేందుకు విభాగాలు ఉండి, ముందర డోరు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఎలక్ట్రిక్ ఫ్రిజ్ ను వాడినట్లే ఈ మట్టి ఫ్రిజ్ ని వాడుకోవచ్చని వారానికోసారి దీన్ని క్లీన్ చేసుకోవాలన్నారు. గత రెండేళ్లుగా ఈ ఫ్రిడ్జ్ ని వాడుతున్నామని కూరగాయలు పండ్లు ఇతర వస్తువులు పెడుతూ అవసరమున్నప్పుడల్లా వాడుతున్నామనీ, దీనికి కరెంటు అవసరం లేదని చెప్పారు. పైన 10 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉంటుంది. అందులోని నీటిని నల్లా ద్వారా తాగడానికి వాడుకోవచ్చని, కూలింగ్ కోసం ఈ ఫ్రిడ్జ్ మూడు గోడల లోపల నుండీ నీరు పారుతు చల్లగా ఉంటుందన్నారు. ఎలక్ట్రిక్ ఫ్రిడ్జ్ తో పోల్చుకుంటే ఇదీ కరెంటు లేకుండా వాడకం, ఆరోగ్యానికి సైతం ఎంతో మేలనీ, దీని ధర సుమారు 8 వేలు ఉంటుందన్నారు.
మట్టితో కూలర్ కూడా
ఇక మట్టితో తయారుచేసిన కూలర్ ను మొదటగా రెండేళ్ల క్రితం తీసుకొచ్చి వాడడం జరిగిందన్నారు. దాని లోపల ఉన్న మోటార్ ఇతర పరికరాలను గమనించి తనే ఇక్కడ స్వయంగా తయారు చేసుకున్నానని తెలిపారు. ఎలక్ట్రిక్ కూలర్ తో పోల్చుకుంటే ఈ మట్టితో తయారు చేసిన కూలర్ ఎంతో ఆరోగ్యానికి మేలని అన్నారు. మట్టి తయారు చేసిన ఈ కూలర్ మూడు నమూనాలు కలిగినవి ఉన్నాయి. ఒకటి మిని కూలర్ ధర రూ.2,700, మీడియం కూలర్ ధర రూ.3,700, హాల్ కూలర్ ధర రూ.4,700 కలిగి ఉన్నాయి. తాము గత రెండేళ్లుగా మట్టి పాత్రలను ఇంట్లో వినియోగిస్తున్నామని, మట్టి కుండలలో, మట్టి కుక్కర్ లో వంటకాలు చేస్తూ మట్టి పాత్రలలో భోజనాలు చేస్తున్నామని అన్నారు. రిమ్స్ డాక్టర్లు సైతం వచ్చి తమ వద్ద నుండి ఈ మట్టి పాత్రలు కుండలు, కూలర్లను వాడుతున్నారని తెలిపారు. వీటితో ఎలాంటి అనర్థాలు ఉండవని ఆరోగ్యానికి ఎంతో మేలని అన్నారు.
మరిన్ని చూడండి