ByGanesh
Thu 25th Jan 2024 10:00 AM
ఏపీ రాజకీయాలను ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్‌గా వైఎస్ షర్మిల రాకకు ముందు.. ఆ తరువాతగా చూడాల్సి ఉంటుంది. ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు అన్ని అంశాలను పక్కకు తోసేసి ఆమె ముందుకు వచ్చేశారు. నిజానికి ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంటర్ అవకుంటే వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన అన్నట్టుగా ఎన్నికలు సాగేవి. కానీ షర్మిల ఎంట్రీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అంటే షర్మిల ఏదో గెలిచేస్తుందని కాదు కానీ గేమ్ చేంజర్ మాత్రం ఆమే అవుతుందనడంలో సందేహం లేదు. నిజానికి ఏపీలో గెలుపు అవకాశాలు ప్రస్తుతానికైతే టీడీపీ, జనసేనలకే ఉన్నాయని పలు సర్వేలు ఇప్పటికే చెప్పేశాయి. మరి షర్మిల వల్ల ఒరిగేదేంటి అంటారా?
మిస్ ఫైర్ అవ్వొచ్చు..
కర్ణుడి చావుకి వంద కారణాలన్నట్టుగా వైసీపీ ఓటమి పాలైతే దాని ప్రధాన కారణాల్లో షర్మిల కూడా ఒకటిగా ఉంటారు.ఈ సారి ఎన్నికలను కాపు సామాజిక వర్గం కూడా సీరియస్‌గానే తీసుకుంది. కాపు సామాజిక వర్గం మొత్తం జనసేనకు మద్దతుగా నిలిచింది. గతంలో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. దాంతో ఓట్లు చీలి వైసీపీకి ప్లస్ అయ్యింది. కానీ ఈ సారి ఓట్లు చీలే పరిస్థితి కూడా లేదు. అలాగని జగన్ గెలవరు అనుకోవడానికి కూడా లేదు. ఆయన లెక్కలు ఆయనకు సహజంగానే ఉంటాయి. అభ్యర్థుల మార్పు, చేర్పుల కారణంగా వైసీపీకి తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు కానీ జగన్ అవన్నీ ఆలోచించకుండా అడుగులు మందుకు వేయరనడంలో సందేహం లేదు. అయితే ఇది మిస్ ఫైర్ కూడా అవ్వొచ్చు. ఇదే అంశం ఎన్నికల్లో వైసీపీకి దెబ్బేసే ప్రధాన కారణాల్లో ఒకటి కావొచ్చు.
కాంగ్రెస్ పార్టీకి జీవమొస్తుందా?
షర్మిల శ్రీకాకుళం టు తిరుపతి వరకూ పర్యటించబోతున్నారు. ఈ క్రమంలోనే తన పర్యటన ఇప్పటికే ప్రారంభమైంది. గత ఎన్నికల్లో తన అన్నను అధికారంలోకి తీసుకొచ్చేందుకు షర్మిల చేసిన పాదయాత్ర సత్ఫలితాలను ఇచ్చింది. ఈసారి కాంగ్రెస్ పార్టీని అయితే గెలిపించబోదు కానీ కాస్త కాంగ్రెస్‌కు ప్లస్ అయ్యే అవకాశమైతే ఉంది. వైఎస్ అభిమానులు, జగన్‌పై వ్యతిరేకత ఉండి బయటకు రాలేక ఇబ్బంది పడుతున్న నేతలంతా షర్మిలకు తోడుగా నిలిచే అవకాశమూ లేకపోలేదు. రాజధాని లేకుండా చేయడం కూడా జగన్‌కు దెబ్బేసే అంశమే. అలాగే నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. మొత్తానికి ఈసారి వైసీపీ విజయానికి చాలా అంశాలు అడ్డుగా నిలుస్తున్నాయి. వాటన్నింటినీ దాటుకుని జగన్ గెలిస్తే అదొక పెద్ద వండర్ అవుతుంది. అలాగే షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ పార్టీకి జీవమొస్తుందా? లేదా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
Are there so many obstacles to Jagan victory?:
YSRCP vs TDP