Australian Open Women Singles: అద్భుతాలు జరగలేదు. సంచలనాలు నమోదవ్వలేదు. డిఫెండింగ్ ఛాంపియన్ అరీనా సబలెంకా వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన బెలారస్ భామ అరీనా సబలెంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో సబలెంకా ధాటి ముందు చైనా క్రీడాకారిణి కిన్వెన్ జెంగ్ నిలవలేక పోయింది. సబలెంకా 6-3, 6-2 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో సబలెంకా అలవోక విజయం సాధించింది. తొలి సెట్‌లో కాస్త పోరాడిన జెంగ్.. ఆ తర్వాత చేతులెత్తేసింది. 2013 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను వరుసగా రెండోసారి దక్కించుకున్న తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో బ్యాక్ టు బ్యాక్ టోర్నీలు గెలవడం ద్వారా దిగ్గజ ప్లేయర్ల సరసన నిలిచింది. 2009, 2010లో సెరీనా విలియమ్స్ ఈ ఘనత సాధించగా 2012, 2013లలో విక్టోరియా అజరెంక వరుసగా రెండు టైటిల్స్ గెలిచింది. ఆ తర్వాత సబలెంకానే ఈ ఘనత సాధించింది. లీ నా తర్వాత పదేళ్లలో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న తొలి చైనా అమ్మాయిగా ఇప్పటికే ఘనత సాధించిన 21 ఏళ్ల జెంగ్.. తుదిపోరులో మాత్రం సబలెంకాకు ఎదురు నిలవలేకపోయింది. సబలెంకా మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరగా ఇది రెండో ట్రోఫీ.
BACK 🏆 TO 🏆 BACK@SabalenkaA is our #AO2024 champion! pic.twitter.com/OcVy2V9ley
— #AusOpen (@AustralianOpen) January 27, 2024
సీజన్ ఆరంభ టోర్నీ అయిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సబలెంకా.. ఈ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ట్రోఫీ నెగ్గడం విశేషం. తొలి రౌండ్‌లో ఎల్లా సీడెల్‌ను ఓడించిన సబలెంకా.. రెండో రౌండ్‌లో బ్రెండా, మూడో రౌండ్‌లో లెసియా సురెంకోను చిత్తు చేసింది. ప్రి క్వార్టర్స్‌లో అమందా అనిసిమోవాను, క్వార్టర్స్‌లో బార్బోరా క్రెజికోవాను ఓడించింది. సెమీస్‌లో అమెరికా యువ సంచలనం కోకో గాఫ్‌ను చిత్తు చేసిన సబలెంకా.. ఫైనల్‌లో జెంగ్‌తో పోరులో అలవోక విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ గెలిచిన క్రీడాకారిణుల జాబితాలో 2007 తర్వాత సబలెంకా ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ ఏడాది సెరీనా విలియమ్స్ కూడా ఒక్క సెట్ కోల్పోకుండా ట్రోఫీ నెగ్గింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో మరో సంచలనం
వరల్డ్ నెంబర్ 2 ర్యాంకర్ అల్కరాస్ క్వార్టర్ ఫైనల్ లో ఓటమిపాలు కాగా.. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ నొవాక్ జకోవిచ్ కు సెమీస్ లో బిగ్ షాక్ తగిలింది. రికార్డు స్థాయిలో పదకొండోసారి ఆస్ట్రేలియా ఓపెన్ గెలవాలన్న జకోవిచ్ ఆశలపై.. నాలుగో సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సినెర్ నీళ్లు చల్లాడు. సెమీఫైనల్ లో 22 ఏళ్ల సినర్ ముందు.. జకోవిచ్ తలవంచక తప్పలేదు. జకోవిచ్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి మరీ సినర్ తన కెరీర్‌లోనే భారీ విజయం సాధించాడు. 6-1, 6-2, 6-7, 6-3తో జకోవిచ్‌పై గెలుపొందాడు.