PV Sindhu & Co assure medal, but men bow out: మలేషియా వేదికగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్(Asia Team Championships)లో భారత అమ్మాయిల జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా టోర్నీ చరిత్రలో మొట్టమొదటి సారిగా పతకం ఖాయం చేసుకుంది. క్వార్టర్‌ఫైనల్లో భారత్ 3-0తో హాంకాంగ్‌పై విజయం సాధించింది. గ్రూపు దశలో టాప్ సీడ్ చైనాను చిత్తుచేసిన పి.వి.సింధు బృందం.. క్వార్టర్స్‌లో హాంకాంగ్‌ను మట్టికరిపించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల సింగిల్స్ తొలి పోరులో రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధు 21-7, 16-21, 21-12తో లో సిన్ యాన్‌పై గెలిచి బోణీ కొట్టగా.. డబుల్స్ మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా జోడీ 21-10, 21-14తో యెంగ్ నెగా టింగ్-యెంగ్ లామ్ ద్వయంపై గెలుపొందింది. మరో సింగిల్స్ మ్యాచ్‌లో యువ షట్లర్ అష్మిత చలిహ 21-12, 21-13తో యెంగ్ సుమ్ యీపై నెగ్గింది. దీంతో 3-0తో భారత్ విజయభేరి మోగించింది. సెమీస్‌లో జపాన్‌తో భారత్ తలపడనుంది.
చైనాకు షాక్ ఇచ్చారిలా….
ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో పటిష్ఠ చైనా(China)కు భారత్(Bharat) దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్స్-2024 టోర్నీలో టాప్ సీడ్ చైనా జట్టును మట్టికరిపించి టేబుల్ టాపర్‌గా నిలిచి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు అద్భుత ఆటతీరుతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటింది. ఈ టోర్నమెంట్‌లో భాగంగా భారత్- చైనా మధ్య ఐదు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భాగంగా తొలుత పీవీ సింధు.. చైనా ప్లేయర్ హాన్ యేతో తలపడింది. మూడు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సింధు 21-17, 21-15తో హాన్‌ను ఓడించి భారత్‌కు 1-0 ఆధిక్యం అందించింది. అక్టోబర్ నుంచి టోర్నీలకు దూరంగా ఉన్న సింధు సింగిల్స్ పోరులో హాన్ యుపై గెలిచింది. నలభై నిమిషాల పాటు సాగిన పోరులో సింధు అద్భుత ప్రదర్శన కనబరిచింది.
పోరాడిన డబుల్స్ జోడీలు….
ఆ తర్వాతి మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ జంట అశ్విన్ పొన్నప్ప- తనీషా క్రాస్టోలను ఓడించిన చైనా ద్వయం లూయీ- టాన్ 1-1తో స్కోరు సమం చేసింది. అనంతరం.. అష్మిత చలీహా వాంగ్ జీ యీ చేతిలో ఓడటం(21-13, 21-15)తో చైనా 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో భారత ద్వయం త్రెసా- గాయత్రి.. లి- లువోల(10-21, 21-18, 21-17)ను ఓడించి స్కోరును 2-2తో సమం చేశారు. ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో అన్మోల్ ఖర్బ్.. వూ లువో తలపడింది. భారత జట్టు టోర్నీలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పదిహేడేళ్ల అన్మోల్ ఖర్బ్ పట్టుదలగా పోరాడింది. 472వ ర్యాంకర్ అయిన అన్మోల్.. 172వ ర్యాంకర్ లువోను 22-20, 14-21, 21-18తో ఓడించి జట్టును నాకౌట్‌కు తీసుకెళ్లింది. దీంతో మహిళల విభాగంలో భారత్ 3-2తో చైనాపై అద్భుత విజయం సాధించింది.
పురుషులకు తప్పని ఓటమి
చివరి గ్రూప్ పోరులో భారత్ 2-3తో చైనా చేతిలో ఓడింది. 4-1 తేడాతో హాంకాంగ్‌ను ఓడించిన భారత్.. క్వార్టర్స్‌లో మాత్రం కీలక ఆటగాళ్లు దూరమవడంతో ఓటమి పాలైంది.
మరిన్ని చూడండి