Fake Ginger Garlic Paste in Hyderabad: హైదరాబాద్: గత కొంతకాలం నుంచి నకిలీ టీ పొడి, నకిలీ పాల ప్యాకెట్లు, నకిలీ ఐస్ క్రీమ్ లు ఇలా అన్ని ఆహార ఉత్పత్తులను కల్తీ చేస్తున్నారు. పైగా వీటిని పెద్ద ఎత్తున విక్రయాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ క్రమంలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger Garlic Paste) తయారు చేసి విక్రయాలు జరుపుతున్న ఓ ముఠా ఆట కట్టించారు సైబరాబాద్ SOT రాజేంద్రనగర్ పోలీసులు. మొహమ్మద్ అహ్మద్ S/o మొహమ్మద్ ఫరూక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అల్లం పేస్ట్ తయారీ యూనిట్ ను సీజ్ చేసి, నిందితుడి వద్ద నుంచి దాదాపు 3,500 కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని మొత్తం విలువ రూ. 2,80,000 ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో మొహమ్మద్ అహ్మద్ అనే వ్యక్తి నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దాంతో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ యూనిట్‌కు వెళ్లి సోదాలు నిర్వహించగా.. 3500 కిలోల (3.5 టన్నులు) ఉత్పత్తి లభ్యమైంది. సింథటిక్ కెమికల్స్ వేసి, అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అక్రమంగా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తయారుచేసే లైసెన్స్ ఇప్పటికే రెండేళ్ల కిందట ముగియగా.. ఇంకా తయారీ చేస్తూ, నకిలీ ఉత్పత్తిని విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు.
నిందితుడు హానికరమైన రంగులను, పదార్థాలను ఉపయోగించి అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారుచేస్తున్నాడు. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి. సింథటిక్ ఫుడ్ కలర్, గమ్ పౌడర్, సోడియం బెంజోయేట్ (నెఫ్రోటాక్సిక్ పదార్థం), మృదుత్వం కోసం కెమికల్ పౌడర్, చెడిపోయిన వెల్లుల్లి తొక్కలు వినియోగిస్తున్నారు. రోషన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మాస్ డైమండ్, స్వచ్ఛమైన అల్లం అంటూ ఈ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు.
సీజ్ చేసిన మెటీరియల్ వివరాలు
1) 1 టన్ను వదులుగా కల్తీ వెల్లుల్లి పేస్ట్ (44 టబ్‌లు ఒక్కొక్కటి 25 కిలోలు)
2) 2 టన్నుల ప్యాక్ చేసిన వెల్లుల్లి పేస్ట్ (70 కాటన్లు ఒక్కొక్కటి 30 కిలోలు, ప్లాస్టిక్ బాక్సుల్లో ఉన్నాయి)
3) సంచుల్లో 500 కేజీల ముడి వెల్లుల్లి మెటీరియల్
4) 2 గ్రైండింగ్ మెషీన్లు
5) సోడియం బెంజోయేట్ వదులుగా ఉండే రసాయన పొడి
6) గమ్ పౌడర్
7) రంగు కోసం పసుపు పొడి
8) స్టిక్కర్లతో వదులుగా ప్యాకింగ్ పెట్టెలు
9) స్టిక్కర్లు.
మరిన్ని చూడండి