Yusuf Pathan slams Hardik Pandya: హైదరాబాద్‌తో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో ముంబై(MI) ఓడిపోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్సీపై మరోసారి విమర్శల జడివాన కురుస్తోంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో 36 పరుగులు ఇవ్వగా… క్వీనా మఫాకా 4 ఓవర్లలో 66 పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లు వేసిన హార్దిక్ పాండ్యా 46 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో జస్ప్రిత్ బుమ్రాను హార్దిక్ పాండ్యా ఉపయోగించిన తీరుపై మాజీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
బుమ్రాకు అప్పటిదాకా ఒకే ఓవరా..?
మాజీ ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్ హార్దిక్ పాండ్యాకు ప్రశ్నలు సంధించాడు. హార్దిక్ పాండ్యా పేలవమైన కెప్టెన్సీ కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్లు చేయగలిగిందని యూసఫ్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. జస్ప్రీత్ బుమ్రాకు ఆరంభంలో ఒక ఓవర్ మాత్రమే ఎందుకు ఇచ్చారని యూసుఫ్ పఠాన్ తన సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 ఓవర్లలో 160 కంటే ఎక్కువ పరుగులు చేసిందని కానీ అప్పటివరకూ బుమ్రాకు కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ ఇచ్చారని… ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌కు ఒక ఓవర్ మాత్రమే ఎందుకు ఇచ్చారని యూసుఫ్ పఠాన్ ప్రశ్నించాడు. 11 ఓవర్లలో బుమ్రాకు ఒకే ఓవర్ ఇవ్వడం అత్యంత చెత్త కెప్టెన్సీ అని యూసఫ్ పఠాన్ విమర్శించాడు. యూసుఫ్ పఠాన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు… జస్ప్రీత్ బుమ్రా బంతుల్లో పెద్ద షాట్‌లను ఆడలేకపోయిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
చరిత్ర సృష్టించిన మ్యాచ్
ఐపీఎల్‌లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఇరు వైపుల బ్యాటర్లు చెలరేగడంతో ఉప్పల్ బౌండరీలతో మోత మోగింది. బ్యాటర్ల రన్ రంగం ముందు బౌలర్లు తేలిపోయారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు….. సాధించిన జట్టుగా హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. ఆరంభం నుంచే ఆ జట్టు బ్యాటర్లు.. దూకుడుగా ఆడారు. క్లాసెన్ 80,అభిషేక్ శర్మ 63, ట్రావిస్ హెడ్ 62, మార్‌క్రమ్ 42 వీరవిహారం చేశారు. భారీ లక్ష్య ఛేధనలో ముంబయి కూడా ధీటుగా బదులిచ్చినా… నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి ఓటమి పాలైంది. ముంబయి బ్యాటర్లలో తిలక్ వర్మ 64, టిమ్ డేవిడ్ 42, నమన్ ధీర్ 30 పరుగులు చేశారు. ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కట్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 523 పరుగులు చేశాయి.
మరిన్ని చూడండి