టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్(England)తో తొలి రెండు టెస్టుల నుంచి వైదొలిగాడు. కోహ్లి దూరం కావడానికి కారణంపై ఊహాగానాలు చేయొద్దని మీడియా, అభిమానులను బీసీసీఐ కోరింది. వ్యక్తిగత కారణాల రీత్యా విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. ఈ విషయమై విరాట్ కోహ్లీ… కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టు మేనేజ్‌మెంట్, సెలక్టర్లతో మాట్లాడాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు ప్రథమ ప్రాధాన్యత అయినప్పటికీ, కొన్ని వ్యక్తిగత కార్యక్రమాల్లో తను ఉండటం తప్పనిసరి కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని వివరించాడు. అతని నిర్ణయానికి బీసీసీఐ గౌరవం ఇచ్చింది. అలాగే విరాట్ కోహ్లీకి మద్దతుగా కూడా బీసీసీఐ నిలుస్తామని తెలిపింది. మిగతా జట్టు సభ్యులపై కూడా నమ్మకం ఉందని, వారు ఈ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తారని తమకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. అయితే విరాట్ కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చే ఆటగాడు ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. జట్టులో విరాట్ స్థానం కోసం దేశవాళీలో మెరుగ్గా రాణిస్తున్న రజత్ పటీదార్(Rajat Patidar) వైపే సెలక్షన్ కమిటీ మొగ్గు చూపింది.
కోహ్లీ స్థానంలో రజత్ పటీదార్..
సర్ఫరాజ్ ఖాన్, ఛతేశ్వర్ పుజారా, రజత్ పటీదార్ మధ్య పోటీ నెలకొన్నా… సెలక్షన్ కమిటీ రజత్ పటీదార్ వైపే మొగ్గు చూపింది. రజత్ పటీదార్ భారత్ ఏ తరపున రజత్ పటీదార్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇంగ్లండ్ లయన్స్‌పై పటీదార్ 151 రన్స్ చేసి సత్తా చాటాడు. గత నెలలో జరిగిన సౌతాఫ్రికా పర్యటన ద్వారా వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రజత్ పటీదార్ కూడా రేసులో ముందున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతని సగటు 45గా ఉంది. చాలా కాలంగా నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఇండియా ఏ తరఫున ఆడుతున్నాడు. ఇంగ్లండ్ లయన్స్‌పై గత రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశాడు. 151, 111 పరుగులతో సత్తా చాటాడు.
భరత్‌కు చోటు ఖాయం!
ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో వికెట్ కీపర్‌గా రాహుల్‌ను తీసుకుంటారా లేదా స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే తీసుకుంటారా అన్న అనుమానాలకు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టత ఇచ్చారు. ఈ టెస్ట్ సిరీస్‌లో రాహుల్ వికెట్ కీపింగ్ చేయడని ద్రవిడ్ స్పష్టం చేశాడు. రాహుల్ ద్రవిడ్ ప్రకటనతో ఆంధ్ర క్రికెటర్ కేఎస్ భరత్… రెండు టెస్టుల మ్యాచులో వికెట్ కీపర్‌గా ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రేపటి తొలి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో విలేకరులతో మాట్లాడిన కోచ్ రాహుల్ ద్రవిడ్.. రాహుల్ కీపింగ్‌పై స్పష్టత ఇచ్చేశాడు. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ కీపింగ్‌కు దూరంగా ఉంటాడని… జట్టు ఎంపిక సమయంలోనే దీనిపై తాము పూర్తి స్పష్టతతో ఉన్నామని ద్రవిడ్ వెల్లడించాడు. రాహుల్ కాకుండా మరో ఇద్దరు వికెట్ కీపర్లను జట్టుకు ఎంపిక చేశామని… అయిదు టెస్టు మ్యాచ్‌లు ఉండటం.. భారత్‌లో పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని రాహుల్ కాకుండా కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్‌లను జట్టులోకి తీసుకున్నామని ద్రవిడ్ వెల్లడించాడు.