BCCI to conduct women’s red-ball tournament in Pune : వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బీసీసీఐ(BCCI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. పుణె వేదికగా మహిళలకూ రెడ్‌బాల్ క్రికెట్ టోర్నీలు నిర్వహించేందుకు సిద్ధమైంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 11 వరకు సీనియర్ మహిళల ఇంటర్ జోనల్ టోర్నమెంట్ ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఒక్కో మ్యాచ్ మూడు రోజులపాటు జరగనుండగా….2018లో రెండు రోజుల మ్యాచ్‌ను బీసీసీఐ నిర్వహించింది. ఈ టోర్నీకి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈస్ట్ జోన్ X నార్త్ ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ X సెంట్రల్ జోన్‌ల మధ్య లీగ్ స్టేజ్‌లో మ్యాచులు జరుగుతాయి. మొత్తం 14 రోజులపాటు నిర్వహించనున్న ఈ టోర్నీలో నార్త్ జోన్, సౌత్ జోన్ నేరుగా సెమీస్‌లోనే ఆడతాయి. లీగ్ స్టేజ్‌లో గెలిచిన రెండు జట్లతో అవి సెమీ ఫైనల్‌లో తలపడతాయి. సెమీస్ మ్యాచ్‌లు ఏప్రిల్ 3న జరుగుతాయి. ఏప్రిల్ 9న ఫైనల్ జరగనుంది. రాబోయే కాలంలోనూ మరిన్ని టెస్టులను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అందులోభాగంగా ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో ప్రాక్టీస్ కోసం రెడ్‌బాల్ మ్యాచ్‌లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం మహిళా క్రికెటర్లు డబ్ల్యూపీఎల్‌లో బిజీగా ఉన్నారు. ఇది మార్చి 17తో ముగుస్తోంది. మరో పది రోజుల తర్వాత ఇంటర్ జోనల్ టోర్నమెంట్ మొదలుకానుంది.
బీసీసీఐ కన్నెర్ర
దేశవాళీ టోర్నీల్లో స్టార్ క్రికెటర్లు ఆడకపోవడంపై బీసీసీఐ(BCCI) కన్నెర్ర చేయడంతో ఆటగాళ్ల తీరు మారుతోంది. బీసీసీఐ హెచ్చరికలతో శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) రంజీ ట్రోఫీ(Ranji Trophy) సెమీఫైనల్లో ఆడనున్నాడు. తమిళనాడుతో సెమీఫైనల్లో తలపడే జట్టులోకి అయ్యర్‌ను ముంబయి సెలక్టర్లుఎంపిక చేశారు. మార్చి మూడు నుంచి జరుగబోయే రంజీ సెమీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని ముంబై రంజీ టీమ్‌కు అయ్యర్ సమాచారం ఇచ్చాడు. రంజీ సెమీఫైనల్స్‌లో సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని అయ్యర్ స్పష్టం చేశాడు. దీంతో అయ్యర్‌ను టీంలోకి తీసుకుంటూ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.
దేశవాళీలో స్టార్ క్రికెటర్లు
ఐపీఎల్(IPL)లో వస్తున్న ఆదరణ, డబ్బుతో యువ క్రికెటర్లు రంజీ మ్యాచ్(Ranji Match)లు అంటేనే తమకేం పట్టనట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రంజీలు ఆడడానికి అయిష్టత చూపించిన ఇషాన్ కిషన్, శ్రేయస్స్ అయ్యర్… ఐపీఎల్ ఆడేందుకు మాత్రం సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ(BCCI) కొత్త నిబంధన తెచ్చేందుకు సిద్ధమైంది. భారత జట్టులో లేనప్పుడు ఐపీఎల్‌లో ఆడాలంటే ఆ ఆటగాడు ఆ టోర్నీ కన్నా ముందు కనీసం కొన్ని రంజీ మ్యాచ్‌లు ఆడడం తప్పనిసరని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ నిబంధనతో యువ ఆటగాళ్లు.. ఐపీఎల్ ఆడాలంటే తప్పనిసరిగా దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ ఆడాల్సి వస్తుంది. రెండు నెలలకు పైగా ఎలాంటి క్రికెట్ ఆడని ఇషాన్, వెన్నునొప్పితో రంజీ ఆడని ఆయ్యర్‌పై బీసీసీఐ టీమ్ మేనేజ్‌మెంట్ ఆగ్రహంగా ఉంది. దేశవాళీ టోర్నీలను కాదని ఐపీఎల్ సన్నాహకాల్లో నిమగ్నమైపోయాడు. ఇషాన్ ప్రవర్తన చూసి అసహనం వ్యక్తం చేసిన బీసీసీఐ పెద్దలు తాజాగా అల్టిమేటం జారీ చేశారు. ఈ అల్టీమేటంతో అయ్యర్ దారిలోకి వచ్చాడు.