ByKranthi
Wed 31st Jan 2024 11:52 PM
సిరిసిల్ల.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడ్డా. వరుస విజయాలతో సిరిసిల్లను కేటీఆర్ కంచుకోటగా మలుచుకున్నారు. కానీ ఇప్పుడు ఆ కోటకు బీటలు వారుతున్నాయి. నిజానికి బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆయన రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కేడర్ ఏమాత్రం నిరుత్సాహానికి గురి కాకుండా మోటివేట్ చేస్తున్నారు. కానీ ఆయన సొంత నియోజకవర్గంలోనే పరిస్థితులు తేడా కొడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత రాష్ట్రంలో పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే సిరిసిల్లలో సైతం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అక్కడి ద్వితీయ శ్రేణి నేతలు, ప్రజా ప్రతినిధులు రాజీనామాల బాట పడుతున్నారు.
ఐదాగురురిని మినహా పట్టించుకోలేదట..
ముఖ్యంగా బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సిరిసిల్ల హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే.. దానిని ఓ రేంజ్‌లో డెవలప్ చేశామని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. కానీ ప్రస్తుతం అసంతృప్త నేతలు మాత్రం కేటీఆర్‌నే టార్గెట్ చేస్తున్నారు. పనుల విషయంలో కొద్దిమందికే ప్రాధాన్యమివ్వడంతో అప్పటి నుంచి ఉన్న అసంతృప్తి ఇప్పుడు బయటకు వస్తోంది. ఐదాగురిని మినహా నియోజకవర్గంలో మరెవ్వరినీ కేటీఆర్ పట్టించుకోలేదట. ఏకంగా సిరిసిల్ల మున్సిపాలిటీలో 16 మంది కౌన్సిలర్లు చైర్మన్‌పై అవిశ్వాసానికి రెడీ అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయాన్ని పక్కనబెడితే మున్సిపాలిటీలో ప్రారంభమైన ముసలం.. నియోజకవర్గమంతా విస్తరించిందట.
తలనొప్పిగా సొంత నియోజకవర్గ పరిస్థితులు..
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా.. అవమానాలకు గురైన నేతలంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వివాదాలకు తావివ్వకపోవడం.. అలాగే జనాల్లోనూ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతలంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రాష్ట్రమంతా పరిస్థితులను చక్కబెడుతున్న కేటీఆర్‌కు సొంత నియోజకవర్గంలో పరిస్థితులు తలనొప్పిగా పరిణమించాయని టాక్. అసలే త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జాతీయంగా ఎదగాలనుకున్న పార్టీకి ప్రాంతీయంగానే పట్టు లేకుంటే మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఈ తరుణంలోనే ఎక్కువ లోక్‌సభ స్థానాలను పొందాలని బీఆర్ఎస్ నానా తంటాలు పడుతుంటే లోకల్ పరిస్థితులు మరోలా ఉన్నాయి. మరి వీటిని బీఆర్ఎస్ ఎలా సెట్ చేస్తుందో చూడాలి.
Big Problem to KTR at His Own Constituency:
BRS Leaser Joins at Sirisilla