వైసీపీ అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన వ్యవస్థలలో వాలంటీర్ సిస్టమ్ ఒకటి. వాలంటీర్ల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రతినెలా ఒకటో తేదీన పెన్షన్ సహా పలు కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తోంది జగన్ ప్రభుత్వం. ప్రభుత్వం తరఫున సేవలు అందిస్తున్న వాలంటీర్లకు వరుసగా నాలుగో ఏడాది వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు నగదు ప్రోత్సహకాలు అందనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,55,464 మందికి మొత్తంగా రూ.392.05 కోట్ల నగదు పురస్కారాలు అందుకోనున్నారు. 997 మంది వాలంటీర్లకు ప్రత్యేకంగా నగదు బహుమతులు.. ఒక్కో వాలంటీర్ కు మండల, పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో రూ. 15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ. 25 వేల చొప్పున మొత్తం రూ. 1.61 కోట్ల నగదు బహుమతుల ప్రదానం ఇవాళ ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ప్రారంభించనున్నారు.
వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు అభినందన..
ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న సేవా వజ్ర అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 రోజులపాటు జరిగే ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15న గుంటూరు జిల్లా ఫిరంగిపురం లో ఏపీ సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. వాలంటీర్ల సేవలను గుర్తంచిన ప్రభుత్వం వారికి అందిస్తున్న పురస్కారాల మొత్తాన్ని పెంచింది. గరిష్టంగా సేవా వజ్ర అవార్డుకు ఎంపికైన వారి ఖాతాల్లో రూ.45,000 జమ చేయనున్నారు. సేవా రత్నలో భాగంగా రూ.30000, సేవా మిత్ర అవార్డు గ్రహీతలకు పది వేల నుంచి రూ.15,000కు పెంచారు.
ఇప్పటివరకు అందించింది (రూ.లలో) పెంచి ఇస్తున్నది (రూ.లలో)
సేవా వజ్ర రూ.30,000 ఇకనుంచి రూ.45,000
సేవా రత్న రూ.20,000 ఇకనుంచి రూ.30,000
సేవా మిత్ర రూ.10,000 ఇకనుంచి రూ.15,000
లంచాలకు, వివక్షకు తావు లేకుండా డెలివరీ మెకానిజంలో భాగమైనందుకు, పారదర్శకంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు తోడుగా ఉంటూ, సహాయకారిగా వ్యవహరిస్తున్నందుకు.. తమ పరిధిలోని 50/100 కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నందుకు.. గ్రామ/వార్డు సచివాలయాలకు, ప్రజలకు మధ్య మంచి సంధానకర్తలుగా వ్యవహరిస్తున్నందుకు… ఇంటి తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి పింఛన్లు ప్రతి నెలా ఒకటో తారీఖునే అందిస్తున్నందుకుపెన్షన్లతో పాటు రేషన్ డెలివరీ, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ళ పట్టాలతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులందరికీ గ్రామ, వార్డు సచివాలయాల సహకారంతో నిర్దిష్ట కాల పరిమితిలో అందేందుకు సహాయపడుతున్నారు. వరదలు, విపత్తులు, ప్రమాదాల సహాయ కార్యక్రమాలలో పాల్గొని ప్రజలను ఆదుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ‘దిశ’ వంటి ముఖ్యమైన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించినందుకు.. కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలందిస్తున్న వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు..
‘సేవా వజ్ర’
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ తో పాటు రూ. 45,000 నగదు బహుమతి.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వాలంటీర్లకు 175 నియోజకవర్గాలలో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాల ప్రధానం
‘సేవా రత్న’
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ తో పాటు రూ. 30,000 నగదు బహుమతి..
ప్రతి మండలం/మున్సిపాలిటీ పరిధిలో 5 మంది చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 10 మంది చొప్పున టాప్ 1 ర్యాంకు సాధించిన వాలంటీర్లకు…మొత్తంగా 4,150 మందికి “సేవా రత్న” పురస్కారాల ప్రదానం…
‘సేవా మిత్ర’
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ తో పాటు రూ.15,000 నగదు బహుమతి..
రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పని చేసిన 2,50,439 మంది వాలంటీర్లకు “సేవామిత్ర” పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.