తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీలో అసంతృప్తజ్వాలలు భగ్గుమంటున్నాయి. పార్టీలో సుదీర్ఘకాలం పని చేసిన నేతలు కేసీఆర్ కు షాకులిస్తున్నారు. అసెంబ్లీ టికెట్లు దక్కని నేతలు ఒకరి తర్వాత ఒకరు గులాబీ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, బీఆర్ఎస్ కు బై బై చెప్పేశారు. హస్తం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల హామీతో పేదలకు మేలు జరుగుతుందని.. అందుకే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కసిరెడ్డి నారాయణరెడ్డి వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. బీఆర్ఎస్ పార్టీలో టికెట్ దక్కకపోవడంతో కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ టికెట్ హామీ దక్కడంతో అధికార పార్టీకి గుడ్ బై చెప్పేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ వైస్‌ఛైర్మన్ బాలాజీ సింగ్ కూడా గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మెదక్ డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.