BRS Public Meeting : గులాబీ దళపతి కేసీఆర్ (KCR) రీ ఎంట్రీకి పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. అనారోగ్యం కోలుకున్న తర్వాత ఎమ్మెల్యే (MLA)గా ప్రమాణస్వీకారం చేశారు కేసీఆర్. అధికారాన్ని కోల్పోయిన తర్వాత…ఆయన ఎంట్రీ అదిరిపోయే రేంజ్‌లో ఉండేలా కారు పార్టీ నేతలు ప్రణాళికలు చేస్తున్నారు. జీఆర్ఎంబీ (GRMB), కేఆర్ఎంబీ(KRMB) నిర్వహణ, నీటి వాటాలపై వాస్తవాలు ప్రజలకు వివరించడమే టార్గెట్‌గా బీఆర్ఎస్ బహిరంగ సభకు రెడీ అవుతోంది. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో భారీ సభ నిర్వహించనుంది. కేసీఆర్ పాల్గొనే సభకు…2లక్షల మంది జనాలు హాజరయ్యేలా వ్యూహాలు తయారు చేస్తోంది. ఫిబ్రవరి మూడో వారంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండనున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లా నుంచే జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ ఇష్యూ పై పోరాటానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ భారీ సభపై ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. పూర్తి స్థాయిలో జనం మధ్యకు రాలేదు. తుంటి ఎముక ఆపరేషన్ అనంతరం కోలుకున్న ఆయన త్వరలో గ్రాండ్ రీఎంట్రీ ఇస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఫిబ్రవరి-17న ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్ కు వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పటి నుంచి కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉంటారని నేతలు అంటున్నారు. తెలంగాణ భవన్ లో ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు గెలుపే లక్ష్యంగా.. తొలుత నల్గొండలో భారీ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న నల్గొండ, భువనగిరి గెలుపే లక్ష్యంగా కేసీఆర్ ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. నల్గొండ నుంచే పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నట్లు తెలుస్తోంది. జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతోంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో నిరసన సభ ఏర్పాట్లపై కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం, ఆత్మస్థైర్యం నింపేలా…బీఆర్ఎస్ అగ్రనేతలు వరుస కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. లోక్ సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించిన కేటీఆర్.. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెడుతున్నారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం చేసినప్పుడే కృష్ణా, గోదావరి జలాల పంపిణీని కేంద్రానికి అప్పగిస్తున్నట్లు కేసీఆర్ ఒప్పుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అబద్ధపు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన…ఈ పుస్తకానికి, ఈ చట్టానికి మీరే రచయిత అని గుర్తు చేశారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి పునాది పడిందే కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడేనని… టీఆరెఎస్ అభ్యంతరం చెప్పకుండా….కేసీఆర్ ఓటు వేసి చట్టాన్ని ఆమోదింపజేశారని వెల్లడించారు. దీనికి బాధ్యులు కేసీఆర్, కె. కేశవరావు అన్న రేవంత్ రెడ్డి…ఈ చట్టం కావడానికి మొట్టమొదటి కారణం కేసీఆరేనని విమర్శించారు. 811 టీఎంసీల నీళ్లపై పంపకాలు ఎలా జరగాలో ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించారని…2015 జూన్ 18న KRMB సమావేశం నిర్వహించిందని, 299 టీఎంసీలు తెలంగాణకు, 511 టీఎంసీలు కేటాయించేందుకు కేసీఆర్, హరీష్ సంతకాలు పెట్టారని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్, హరీష్ రావు… చేసిన పాపాలను కప్పిపుచ్చి కాంగ్రెస్ పై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణకు 50 శాతం వాటా అడగకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారు.
మరిన్ని చూడండి