Buddy Review: మూవీ రివ్యూ: బడ్డీ


చిత్రం: బడ్డీ
రేటింగ్: 1.5/5
నటీనటులు: అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా సింగ్, ముకేష్ రిషి, ఆలి తదితరులు
సంగీతం: హిప్ హాప్ తమిళ
కెమెరా: కృష్ణన్ వసంత్
ఎడిటింగ్: రూబెన్
నిర్మాత: జ్ఞానవేల్ రాజా
దర్శకత్వం: సాం ఆంటోన్
విడుదల: ఆగస్టు 2, 2024

అల్లు శిరీష్ ఎప్పటినుంచో హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కొత్త కథ ఎందుకని, తమిళంలో సక్సెస్ అయిందనుకున్న ఈ సినిమాని ఓకే చేసి రీమేక్ కి సిద్ధమైనట్టున్నాడు. ఇంతకీ ఇందులో ఏముంది? శిరీష్ కి ఫలితం దక్కిందా అనేవి చూద్దాం.

కథలోకి వెళ్లితే ఆదిత్య (అల్లు శిరీష్) ఒక కమర్షియల్ పైలట్. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గా పని చెసే పల్లవి (గాయత్రి భరద్వాజ్) ని గొంతు మాత్రమే విని ఇష్టపడతాడు. పల్లవి కూడా ఆదిత్యని ప్రేమిస్తుంటుంది.

ఒక అనుకోని సంఘటనలో పల్లవి ప్రమాదంలో చిక్కుకుంటుంది. హాంగ్ కాంగ్ లో ఉండే ఒక క్రిమినల్ డాక్టర్ అర్జున్ (అజ్మల్ అమీర్) పల్లవిని కిడ్నాప్ చేయించి, కోమాలోకి నెట్టి హాంగ్ కాంగ్ తీసుకొస్తాడు. ఆమె అవయవాల్ని ఒక పెద్ద డాన్ కొడుక్కి అమర్చి, అతన్ని బతికించి వంద మిలియన్ డాలర్లు సంపాదించాలన్నది ఆ డాక్టర్ ఎత్తుగడ.

అయితే పల్లవిని కోమాలోకి పంపగానే ఆమె ఆత్మ ఒక టెడ్డీ బేర్ లోకి దూరుతుంది. అక్కడి నుంచి ఆ టెడ్డీ బేర్ కి, ఆదిత్యకి మధ్యన జరిగే డ్రామాతో చివరికి కథ క్లైమాక్సుకి చేరుతుంది. పల్లవి మళ్లీ తన శరీరాన్ని పొందుతుందా? ఆదిత్య ఈ క్రైం ని ఎలా ఛేదిస్తాడు.. అనేది తక్కిన కథాంశం.

అసలీ కథ తమిళంలో ఎందుకు ఆడిందో తెలియదు. ఎల్కేజీ నుంచి ఐదో క్లాస్ చదివే పిల్లలు దీనికి టార్గెట్ ఆడియన్స్ అనుకోవచ్చు. అయితే తీసిన విధానం, ఎక్కడా ఎమోషన్ పండని వైనం చూస్తే వాళ్లు కూడా “ఇదేం సినిమా” అంటారేమో అనేలా ఉంది.

కోమాలో ఉన్న వ్యక్తి ఆత్మ శరీరం విడిచి టెడ్డీ బేర్ లోకి వెళ్లడమేంటి? చనిపోతే వెళ్లిందనుకోవచ్చు! అయినా ఇలాంటివి హారర్ జానర్లో వర్కౌట్ అవుతాయి కానీ.. కామెడీకి, సెంటిమెంటుకి పని చెయ్యవు. పైగా ఇది సీరియస్ క్రైం యాక్షన్ గా నడుస్తుంటుంది.

ఇదంతా ఒకెత్తైతే టెడ్డీ బేర్ కి ఏదైనా బాధ కలిగితే కన్నీళ్లు మాత్రం కోమాలో ఉన్న పల్లవికి కారతాయి. అంటే ప్రాణం ఎక్కడున్నట్టు? అంతా అయోమయ గందరగోళం.

దీనికి తోడు పల్లవిగా ఉన్నంతవరకు పద్ధతిగా ఉండే అమ్మాయి, టెడ్డీ బేర్ లోకి దూరగానే కామెడీ చేస్తుంటుంది. ఈ షిఫ్ట్ ఏమిటో అర్ధం కాదు. కథనం రాసుకోవడంలోనే అపరిపక్వత తాండవించింది.

టెడ్డీ బేర్ కి ప్రాణం వచ్చి రోడ్ మీద తిరుగుతుంటే ఎవరూ ఆశ్చర్యపోరు. పైగా దగ్గరకొచ్చి సెల్ఫీలు అడుగుతారు. ఒక పిల్లాడైతే ఎటువంటి ఆశ్చర్యాన్ని వ్యక్తపరచకుండా చాలా కేజువల్ గా మాట్లాడుతూ ఫ్రెండైపోతాడు. మనిషి ఆత్మ టెడ్డీలో దూరడమేంటనే ప్రశ్న హీరో నుంచి కమెడియన్ వరకు ఎవ్వరూ వేసుకోరు. అది నేచురల్ అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటాయి పాత్రలన్నీ.

కాన్-ఫ్లిక్ట్ పాయింట్ కూడా నేచురల్ గా వచ్చినట్టు కాకుండా బలవంతంగా ఉంది. బిజీ ఎయిర్పోర్టులో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో ఎవ్వరూ బ్యాకప్ లేకుండా ఇద్దరే పని చేస్తుండడం, సరిగ్గా అప్పుడే హీరో నడిపే విమానానికి ఇబ్బంది రావడం అస్సలు కన్విన్సింగ్ గా లేదు.

ప్రధమార్ధమంతా నీరసంగా సాగి ఏ మాత్రం గ్రిప్ లేని ఇంటర్వల్ సన్నివేశంతో బ్రేక్ పడుతుంది. ద్వితీయార్ధం చూడడానికి బలమైన హుక్ పాయింటే లేదు. అప్పటికి హీరోయిన్ సమస్యలో ఉన్నా, హీరో వెళ్లి కాపాడేస్తాడని అర్ధమవుతున్నా, ఎలా కాపడతాడో చూద్దామన్న ఉత్సుకత కలగదు.

ద్వితీయార్ధం కూడా సహన పరీక్ష పెడుతుంది. క్లైమాక్స్ లో విమానం ఫైట్ సీక్వెన్స్ రిచ్ గా తీసారు కానీ అప్పటికే నీరసించిన ప్రేక్షకులకి దానిని ఆస్వాదించే పరిస్థితి కనపడదు.

అల్లు శిరీష్ కి ఈ సినిమా ఏ రకంగానూ ఉపయోగపడదు. ఎందుకంటే అతని హీరోయిజం ఎస్టాబ్లిష్ కానే లేదు.

హీరోయిన్ సగం సినిమా టెడ్డీ బేర్ రూపంలోనే ఉంటుంది కనుక ఆమెకీ ప్లస్సయింది ఏమీ లేదు.

విలన్ గా అజ్మల్ అమీర్ రొటీన్ గా ఉన్నాడు.

ముకేష్ రిషి పాత్ర కూడా ఏ మాత్రం హత్తుకోదు.

నేపథ్య సంగీతం బలహీనంగా ఉంది. పాటలు అకట్టుకునేలా లేవు. ఇతర సాంకేతిక విలువలు ఓకే.

ఎలా చూసుకున్నా ఈ చిత్రం చాలా ఎమెచ్యూర్ గా ఉంది. దర్శకుడికి నెట్ ప్రాక్టీస్ కోసం సరదాగా తీసిన సినిమాలా ఉంది తప్ప ఎక్కడా ప్రేక్షకుల స్టాండర్డ్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసినట్టు లేదు. రెండుంపావు గంటల సేపు ప్రేక్షకుల సహనంతో కబడ్డీ ఆడుకున్న చిత్రమిది.

బాటం లైన్: సహనంతో క”బడ్డీ”

The post Buddy Review: మూవీ రివ్యూ: బడ్డీ appeared first on Great Andhra.



Source link

Leave a Comment