దిశ, ఫీచర్స్ : ఒత్తిడి.. ఆధునిక మానవుని జీవితంలో అంతర్గత శత్రువుగా మారుతోంది. అది పర్సనల్ ప్రాబ్లమ్ కావచ్చు లేదా ప్రొఫెషనల్ ఇష్యూస్ కావచ్చు. మానసిక ఒత్తిడి మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు ఎదురయ్యే అనేక సంఘటనలు, సమస్యలు, అనుభవాలు మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. హై కార్టిసాల్ ప్రి ఫ్రంట్ కార్టెక్స్‌లో యాక్టివిటీస్‌ను తగ్గిస్తుంది. అందుకే దానిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.
జీవితంలో ఒత్తిడి అనివార్యం కావచ్చు కానీ, పరిమితికి మించి ఒత్తిడి గురికావడం అనేది గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. చికిత్స చేయకపోతే బర్న్ అవుట్ లేదా డిప్రెషన్ వంటివి శాశ్వతంగా వేధించవచ్చు. అందుకే దానిని ఆరోగ్యకరమైన మార్గాల్లో ఎదుర్కోవాలని నిపుణులు చెప్తున్నారు. అదెలాగో చూద్దాం.
వ్యాయామాలు- సొంత ఆలోచన
ఒత్తిడిని దాని ద్వారా తలెత్తే బర్న్ అవుట్ సమస్యను ఎదుర్కోవడానికి సొంత మార్గంలో పనిచేసే అద్భుతమైన చికిత్సగా వ్యాయామం పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే దానివల్ల ఒత్తిడికి కారణం అయ్యే కార్టిసాల్ ఇతర స్ట్రెస్ హార్మోన్లు రిలీజ్ అవడం తగ్గిపోతుంది. మానసిక స్థితిని మెరుగు పరిచే ఎండార్ఫిన్లను, సెరోటోనిన్లను విడుదల చేయడంలో వ్యాయామం, శారీరక శ్రమ దోహదపడతాయి. మెదడుకు రక్త సరఫరా మెరుగు పడటంవల్ల ప్రిఫ్రంటల్ కార్టెక్స్‌లో పాజిటివ్ యాక్టివిటీస్ ఏర్పడతాయి. అప్పుడు సొంత ఆలోచనా సామర్థ్యం కూడా పెరుగుతుంది. దీంతో బర్న్ అవుట్ ఇష్యూస్‌ను ఎదుర్కొంటారు.
కాగ్నెటివ్ యాక్టివిటీస్
మితిమీరిన ప్రతికూల ఆలోచనన స్ట్రెస్ రెస్పాన్స్‌ను ప్రేరేపిస్తుంది లేదా ఒత్తిడిని పొడిగించవచ్చునని 2019లో నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. నెగెటివ్ థాట్స్ ఎక్కువైనప్పుడు ఒత్తిడి, కార్టిసాల్ మధ్య బలమైన లింక్ ఏర్పడుతుందని, ఈ రెండు ప్రభావాలు హేతు బద్ధమైన ఆలోచనను అడ్డుకుంటాయని పరిశోధకులు కనుగొన్నారు. అందుకే ప్రతి కూల ఆలోచనలకు చెక్ పెట్టేలా, మెదడును ట్రీట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. క్లినికల్ సెట్టింగ్‌లలో అయితే కాగ్నెటివ్ బిహేవియర్ థెరపీ ఇందుకు దోహదం చేస్తుంది. మెదడును ఆలోచింపజేసే, మోటివేటివ్ పనుల్లో పాల్గొనడం వంటివి దీనికి చక్కటి పరిష్కారం.
సృజనాత్మక కార్యకలాపాలు
సృజనాత్మక కార్యకలాపాలు ఒత్తిడి, బర్న్ అవుట్ పరిస్థితుల నుంచి బయటపడేందుకు బాగా హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా ఆర్ట్, క్రాఫ్ట్, గార్డెనింగ్, డ్యాన్స్, ఫజిల్ చేయడం, వంట చేయడం, మ్యూజిక్ వినడం, ఇష్టమైన గేమ్స్ ఆడటం వంటి నిమగ్నం అవడంవల్ల మెదడులోని ప్రి ఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివిటీస్ సానుకూలంగా ప్రభావితం చేస్తాయి. స్ట్రెస్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. బర్న్ అవుట్ నుంచి కాపాడుతాయి.
సామాజిక సంబంధాలు
మీరు ఒత్తిడిగా ఫీలవుతున్నప్పుడు ఒంటరిగా ఉంటే సమస్య మరింత అధికం కావచ్చు. ఇలాంటప్పుడు సామాజిక పరిస్థితుల్లో నిమగ్నం అవ్వడం, సంబంధాలు మెరుగు పరుచుకోవడం మేలు చేస్తుంది. బయటకు వెళ్లడం, మీకు తెలిసిన వ్యక్తులు, స్నేహితులతో మాట్లాడటం, మ్యూజిక్ ఈవెంట్స్‌లో, గేమ్స్‌లో పాల్గొనడం లేదా చూడటం వంటివి మీ సోషల్ నెట్ వర్కును పెంచడమే కాకుండా మెదడులో ఆక్సిటోసిన్ హార్మోన్ ను రిలీజ్ చేయడంలో ప్రేరణగా నిలుస్తాయి. దీంతో బర్నవుట్ సమస్యను అధిగమిస్తారు.
స్వీయ ఓదార్పు లేదా ప్రేరణ
ఇబ్బంది కర పరిస్థితులను అధిగమించడంలో కొన్నిసార్లు స్వీయ ఓదార్పు, సొంతంగా తీసుకునే నిర్ణయాలు అద్భుతంగా పనిచేస్తాయి. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్, మెడిటేషన్ వంటివి స్వీయ ఓదార్పు లేదా ప్రేరణలో భాగంగా ఉండవచ్చు. ఇవి వాగస్ నరాలను ప్రేరేపిస్తాయి. ఫలితంగా ఒత్తిడి హార్మోన్‌గా పేర్కొనే కార్టిసాల్ తగ్గుతుంది. అలాగే సందర్భోచితంగా వచ్చే నవ్వు, ఏడుపు, భావోద్వేగ సన్నివేశాలు కూడా ఒత్తిడిని దూరం చేసేందుకు అవసరమైన ఆక్సిటోసిన్ అండ్ ఎండార్ఫిన్స్ వంటి హార్మోన్లను రిలీజ్ చేస్తాయి. ఫలితంగా బర్న్ అవుట్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.