విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. సీఐడీ తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి.. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును సోమవారానికి వాయిదా వేశారు. వాస్తవానికి ఇప్పటికే మూడు రోజుల నుంచి ఏ రోజుకారోజు వాదనలు ముగిసి తీర్పు వస్తుందని ఆశించినప్పటికీ.. ఇరువురు న్యాయవాదుల మద్య తీవ్రస్థాయిలో వాదోపవాదనలు జరిగాయే కానీ.. తీర్పు ఆలస్యమైంది. శుక్రవారం నాడు అనేక అంశాలు ప్రస్తావనకు రాగా.. దూబే ప్రశ్నలకు సీఐడీ కంగుతిన్నట్లుగా తెలుస్తోంది. కోర్టులో వాదనలు విన్న తర్వాత మీడియా ముందుకు వచ్చిన ప్రమోద్ కూమార్.. చంద్రబాబును బయటికి తెచ్చేస్తున్నా అన్నట్లుగా చాలా ధీమాగా మాట్లాడారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
దూబే వాదనలు ఇవీ..
కస్టడీకి ఇవ్వాలన్న ఏజీ వాదనలపై దూబే అభ్యంతరం వ్యక్తం చేశారు. కస్టడీకి కోరడం పసలేని వాదన అని కొట్టిపడేశారు. ఇప్పటికే రెండు రోజులు కస్టడీకి తీసుకున్నాన్నారు. విచారణలో చంద్రబాబు పూర్తిగా సహకరించారన్నారు. కస్టడీ ముగిసినా ఇప్పటివరకు కేసు డైరీ సమర్పించలేదని తెలిపారు. కేసు డైరీ ఎక్కడ ఉందని సీఐడీ అధికారులను న్యాయమూర్తి ప్రశ్నించారు.
– చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటీషన్లపై వాదనలు వినిపించాం
– టీడీపీ బ్యాంకు అకౌంటులోకి స్కిల్ డెవలప్మెంట్ స్కాం డబ్బులు వచ్చాయని బురద జల్లుతున్నారు
– ఆ బ్యాంకు వివరాలను ఇన్ కంట్యాక్స్, ఎన్నికల సంఘానికి అందచేశాం
– ఆ డాక్యుమెంట్ తెచ్చి స్కిల్ డెవలప్మెంట్ నిధులుగా చెబుతున్నారు
– 2022 జనవరిలో కేసు నమోదు చేస్తే ఇప్పటికీ దర్యాప్తు సాగుతున్నట్లు సీఐడీ చెబుతోంది
– ఈ కేసులో ఇప్పటికే 13 మంది బెయిల్‌పై బయట ఉన్నారు
– ప్రధాన నిందితులకు కూడా బెయిల్ ఇచ్చారు. 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ దాటాక, పోలీసు కస్టడీ తీసుకోకూడదు
– ఇప్పటికే రెండు రోజులు కస్టడీకి తీసుకున్నారు.. అన్యాయంగా చంద్రబాబును ఈ కేసులో ఇరికించారు
– కార్పొరేషన్‌కు, ప్రైవేటు సంస్థలకు మధ్య ఒప్పందం జరిగింది
– ఇందులో చంద్రబాబు పాత్ర ఎక్కడా లేదు
– మా వాదనలు పూర్తి స్థాయిలో వినిపించాం
– సోమవారం తీర్పు ఇస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చెప్పారు
– కస్టడీకి కోరడం, పసలేని వాదనలు ఏంటి ఇవన్నీ అని న్యాయమూర్తికి చెప్పిన దూబె
– ఇప్పటికే రెండు రోజులు కస్టడీకి తీసుకున్నారు.. విచారణలో చంద్రబాబు అన్ని విధాలుగా సహకరించారు
– కస్టడీ ముగిసినా ఇప్పటివరకు కేసు డైరీ ఎందుకు సమర్పించలేదు..? అని సీఐడీని దూబె ప్రశ్న
– అంతేకాదు.. కేసు డైరీ ఎక్కడ ఉందని సీఐడీ అధికారులను న్యాయమూర్తి కూడా ప్రశ్నించారు.
పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు
‘బాబుకు ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుంది. చంద్రబాబు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ఖాతాకు నిధులు మళ్లించారు. ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దు. ఆయన బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకోవాలి. ఇప్పటికే ఆదాయపన్ను వివరాలు కూడా తీసుకున్నాం. సీఐడీ అధికారులు విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో చంద్రబాబు పాత్ర, ఇతరులకు డబ్బు పంపిణీ అంశాలపై విచారణ చేయాలి. CIDకి కోర్టు ఇచ్చిన రెండ్రోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు. చంద్రబాబును మరో మూడ్రోజుల కస్టడీకి ఇవ్వండి’ అని కోర్టుకు ఏఏజీ పొన్నవోలు విజ్ఞప్తి చేశారు.
ఫైర్.. ఫైర్ విల్ బీ ఫైర్!
కాగా.. నిన్న విచారణ సందర్భంగా ఏఏజీ, చంద్రబాబు తరఫు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. నువ్వెంతంటే నువ్వెంత అనుకునే వరకూ వాదనలు వెళ్లాయి. అసలు వాదనలు ఇంత దూరం వెళ్లడానికి కారణం ఏంటంటే.. బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలకు తాను రిప్లై వాదనలు వినిపిస్తానని ఏఏజీ చెప్పారు. దీనిపై దూబే అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము వాదనలు ప్రారంభించడానికి ముందే ఈ విషయాన్ని చెప్పాలి కానీ ఇప్పుడు చెప్పడమేంటని దూబే ప్రశ్నించారు. ఏఏజీ వాదనలు పూర్తయ్యాకే తాను వాదనలు వినిపించానని.. తిరిగి రిప్లై వాదనలెలా వినిపిస్తారని అడిగారు. అయినా సరే.. తనకు వాదనలు వినిపించేందుకు 15 నిమిషాలు సమయం ఇవ్వాలంటూ కోర్టును పొన్నవోలు కోరారు. దీనికి దూబే అభ్యంతరం చెప్పడంతో ఆగ్రహించిన పొన్నవోలు.. ‘యూ ఆర్ నథింగ్ బిఫోర్ మీ’ అంటూ ఫైర్ అయ్యారు. దీనికి దూబే.. ‘మీరు డబుల్ ఏజీ’ అనడంతో ఏఏజీ ఆవేశంగా కోర్టు హాలు నుంచి వెళ్లిపోయారు. మొత్తానికి కోర్టు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.