చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు డీఐజీ రవి కిరణ్. జైలులో ఉన్న వైద్యాధికారులు రోజుకు మూడుసార్లు ఆయనకు వైద్యపరీక్షలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు జైల్లోకి వచ్చినప్పుడు 66 కేజీలు ఉండగా, ప్రస్తుతం 67 కేజీల బరువుకు చేరుకున్నారని వివరించారు. చంద్రబాబు బరువు తగ్గారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎలాంటి భయాలు అవసరం లేదన్నారు. కొంత డీహైడ్రేషన్ కు గురై చర్మ సంబంధిత సమస్యలు తలెత్తిన మాట వాస్తవమేనని, అయితే వెంటనే డెర్మటాలజిస్టులను రప్పించి చికిత్స అందించామన్నారు. తాగునీరు, భోజనం విషయంలో నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏ మందులు ఇస్తున్నారనేది డాక్టర్ కు, పేషెంట్ కు మధ్య ఉండే ప్రైవసీ అన్నారు. చంద్రబాబు నాయుడు రోజూ వినియోగిస్తున్న మందులనే వాడుతున్నారన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై దుష్ప్రచారం తగదన్నారు. జైల్లో 2000 మంది ఖైదీలు ఉంటారన్నారు. వారిలో ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై బాధ్యత తమపైనే ఉందన్నారు. వాటర్ పొల్యూషన్ కారణమైతే అందరికీ రావాలి కదా? అని ప్రశ్నించారు. స్టెరాయిడ్స్ అంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. హెల్త్ బులెటిన్స్ రోజూ విడుదల చేస్తామన్నారు.