భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి(Chirag Shetty and Rankireddy) సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ టోర్నమెంట్‌లో టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచారు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడి విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. డబుల్స్ సెమీఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేతలు… మలేషియాకు చెందిన ఆరోన్ చియా-సోహ్ వూయ్ యిక్‌లపై సాత్విక్-చిరాగ్ జోడి విజయం సాధించింది. 21-18 21-14తో వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టారు. ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్ పోరులో రెండో గేమ్‌లో చివరి 12 పాయింట్లలో 11 పాయింట్లు గెలిచిన సాత్విక్-చిరాగ్ జోడి విజయం సాధించింది. పైనల్లో సాత్విక్-చిరాగ్ జోడి… మూడో సీడ్, కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్- సియో సీయుంగ్ జేలతో తలపడతారు.
ముగిసిన ప్రణయ్ పోరాటం
సూపర్ 750 టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్ 2, చైనాకు చెందిన షి యు క్వితో జరిగిన సెమీఫైనల్ పోరులో ప్రణయ్ 21-15 21-5తేడాతో పరాజయం పాలయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌లో కాస్త పోరాడిన ప్రణయ్… రెండో సెట్‌లో పూర్తిగా చేతులెత్తేశాడు. తొలి సెట్‌లో 14-14తో సమంగా కనిపించిన ప్రణయ్.. ఆ తర్వాత అనవసర తప్పిదాలతో ఆ గేమ్‌ను కోల్పోయాడు. షి యు క్వి కోర్టు నలుమూలల వేగంగా కదిలి ప్రణయ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. తొలి గేమ్‌లో ప్రణయ్ 6-3తో ఆరంభంలో ఆధిక్యాన్ని సాధించినా దానిని కొనసాగించలేకపోయాడు. షి యు క్వి కచ్చితమైన స్మాష్‌లతో ప్రణయ్‌పై ఆధిక్యం సాధించాడు. షి యు క్వి నెట్ ప్లేతో ప్రణయ్‌ను అలసిపోయేలా చేశాడు. రెండో గేమ్‌లో షి యు క్వి 11-4తో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. డ్రాప్‌లు, హాఫ్ స్మాష్‌లు, రివర్స్ హిట్‌లు, సుదీర్ఘ ర్యాలీలతో ప్రణయ్ కంటే మెరుగ్గా కనిపించాడు. ఇక ఇండియా ఓపెన్ టోర్నమెంట్‌లో తొలిసారి సెమీఫైనల్లో చేరి ప్రణయ్ రికార్డు సృష్టించాడు.
మహిళల సింగిల్స్…
మహిళల సింగిల్స్‌లో చైనా క్రీడాకారిణి చెన్ యు ఫీ ఫైనల్‌కు చేరుకుంది. టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అయిన చెన్ యు ఫీ… సెమీఫైనల్స్‌లో వాంగ్ జి యిని 21-13 21-18తో ఓడించి ఫైనల్ చేరింది. మరోవైపు తాయ్ ట్జు యింగ్ ఈ సీజన్‌లో వరుసగా రెండోసారి మహిళల సింగిల్స్ ఫైనల్‌కు చేరుకుంది.
ఇక్కడ సాధించేస్తారా..?
మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ(Malaysia Open Super 1000 tournament) ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడికి ఓటమి ఎదురైంది. ఫైనల్ వరకూ అద్భుతంగా ఆడిన ఈ ద్వయం తుదిమెట్టుపై బోల్తా పడింది. ప్రపంచ రెండో సీడ్ సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి… 21-9, 18-21 17-21 తేడాతో చైనాకు చెందిన వరల్డ్ నెంబర్ వన్ జోడీ వాంగ్ – లియాంగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమితో భారత జోడి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఇండియా ఓపెన్ టోర్నమెంట్‌లో టైటిల్ సాధించాలని సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి పట్టుదలగా ఉంది.