హీరోగా రూపొందుతోన్న భారీ హిస్టారికల్ మూవీ `సైరా నరసింహారెడ్డి` ఫ్రీ రిలీజ్ దుమ్మురేపుతోంది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ లెవల్లో ప్యాన్ ఇండియా మూవీగా సినిమా విడుదలవుతుంది. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక హైదరాబాద్ ఎల్ బి నగర్లో దుమ్మురేపింది. రెండు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు ఈ వేడుకకు భారీగా హాజరయ్యారు.
ప్రీ ఈవెంట్లో అల్లు అరవింద్ స్పీచ్
చిరంజీవి, పవన్ కల్యాణ్, రాజమౌళి వంటి అతిరథులు వేదికపై ఉండగా, అరవింద్ మాట్లాడుతూ ఎవరికీ తెలియని ఓ విషయం చెబుతా వినాలని సభికులను కోరారు. ఆఖరికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కూడా ఆ విషయం తెలియదని, అదేంటంటే, సైరా సినిమా చూసిన మొదటి ప్రేక్షకుడ్ని తానేనని వెల్లడించారు. చిత్ర యూనిట్ సభ్యులు కాకుండా తానొక్కడ్నే సైరా మొత్తం వీక్షించానని తెలిపారు. సినిమా చూసి కిందపడిపోయానని, వెంటనే చిరంజీవిని హత్తుకుని సంతోషం వ్యక్తం చేశానని వివరించారు. సైరా సూపర్ హిట్ అని అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. అయితే, చిరంజీవితో ఎన్నో సినిమాలు చేసిన తాను ఇలాంటి సినిమా చేయలేకపోయానని బాధపడుతున్నానని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. ఆ అవకాశం రామ్ చరణ్ కు దక్కిందని అన్నారు.
రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ మెగాస్టార్ కత్తితో నరికే సన్నివేశం ఉంది. అలా ఆయన రికార్డులని తెగనరకడానికి వస్తున్నారు. ఈ చిత్రంలో మేము ఎమోషనల్ గా సాగే ఫైట్స్ చేశాం అని రామ్ లక్ష్మణ్ తెలిపారు.ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ 30 ఇండస్ట్రీ పృథ్వి రాజ్ మాట్లాడుతూ ‘‘ తాను చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా చిరంజీవి గారి రుణం తీర్చుకోలేను, ఈ జన్మ మొత్తానికి గుర్తుండిపోయే పాత్ర ఈ చిత్రంలో చేశాను. నా పాత్ర ఇంటర్వెల్ లో చాలా కీలకం. నరసింహ స్వామి మళ్ళీ పుట్టాడు దొరా అనే ఎమోషనల్ డైలాగ్ తనకు ఉందని తెలిాపాడు. సైరా రికార్డులు క్రియేట్ చేస్తుందని, ఈ చిత్రం ఏ రేంజ్ లో ఉండబోతోందో నా పాత్రని బట్టే చెప్పొచ్చు అని పృథ్వి అన్నాడు. చిత్రం కోసం 250 రోజుల పాటు కష్టపడిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కు కృతజ్ఞతలు అని సురేందర్ రెడ్డి తెలిపారు. కొరటాల శివ, వివి వినాయక్ చిత్ర యూనిట్ కి, రాంచరణ్, చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి నిర్మాణంలో నటించే కొడుకులు ఉన్నారు. కానీ కొడుకు నిర్మాణంలోనే తండ్రి నటిస్తున్నాడు. ఇది చాలా ముచ్చటగా ఉంది అని కొరటాల అభిప్రాయపడ్డారు.సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ట్రైలర్ లో కొన్ని సన్నివేశాల్లో చిరంజీవి గారు అదరగొట్టేశారు. ఒక కొడుకుగా రాంచరణ్ ఒక స్థాయిని సెట్ చేశాడు అని తేజు ప్రశంసించాడు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ చరణ్ అన్న సైరా చిత్రాన్ని నిర్మించి మీతో పాటు మా దాహాన్ని కూడా తీర్చబోతున్నారు అని తెలిపాడు.
22వ తేదీనే ఎందుకు ఎంచుకున్నారు?
ఎవరి సపోర్ట్ లేకుండా సెప్టెంబర్ 22వ తేదీన నటుడిగా చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురులేకుండా తన సినీ ప్రస్థానాన్నికొనసాగిస్తూ వస్తున్నారు. చిరంజీవి సినిమా కెరీర్ లో సెప్టెంబర్ 22వ తేదీకి అత్యంత ప్రాముఖ్యం ఉంది. ఆయన నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు ఇదే తారీఖున 1978లో రిలీజైంది. ఆ సినిమాతోనే ఇండస్ట్రీలో పునాది రాళ్లు వేసుకొన్నారు. దాంతో నటుడిగా ఆయన ఈ రోజు 41వ జన్మదినాన్ని జరుపుకొంటున్నారు.ఇక చిరంజీవి కెరీర్‌లో 100వ చిత్రం త్రినేత్రుడు. ఆ చిత్రం కూడా సెప్టెంబర్ 22వ తేదీ 1988లో విడుదలైంది. ఈ ప్రత్యేకమైన తేదీనే సైరా ప్రిరిలీజ్ వేడుకకు ముహుర్తం సెట్ అయింది.
స్టెప్స్, డాన్సులు ఉండవు
సాధారణంగా మెగాస్టార్ సినిమా అంటే అభిమానులు స్టెప్స్, డాన్సులు కోరుకుంటారు. కానీ ఇప్పుడు సైరాలో అవేం కనిపించవు. స్వాతంత్ర నేపథ్యంలో వచ్చే సినిమా కావడం.. అందులోనూ ఒక తెలుగు వీరుడి కథవ్వడం.. పీరియాడికల్ సినిమా కావడంతో యాక్షన్ సీక్వెన్సులకు చోటుంటుంది కానీ పాటలు, డాన్సులకు మాత్రం కాదు. పైగా సైరాలో కేవలం మూడు పాటలు మాత్రమే ఉంటాయని దర్శకుడు సురేందర్ రెడ్డి ఇదివరకే చెప్పారు . అందులోనూ ఓ పాట ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో వస్తుంది. ఇక రెండు పాటలు కూడా సన్నివేశాలకు అనుగుణంగా ఉండే అవకాశం ఉంది. అనవసరంగా పాటలు వస్తే సినిమాపై అభిప్రాయం మారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే కథను మాత్రమే ముందుకు తీసుకెళ్లాలని దర్శకుడు అనుకున్నట్లుగా తెలుస్తోంది.
సైరా కథపై ఇంకా వీడని వివాదం
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని సినిమాగా తియ్యడానికి పరుచూరి బ్రదర్స్ ఎప్పుడో సినిమా స్క్రిప్ట్ తయారు చేసారు. ‘ఖైదీ నెంబర్ 150’ రిలీజ్ అయిన తరువాత పరుచూరి బ్రదర్స్ కథతో, 80 కోట్ల బడ్జెట్‌తో ఆ సినిమా తియ్యాలి అనుకున్నారు. అయితే బాహుబలి-2 తరువాత సీన్ మారిపోయింది. బాహుబలి కలెక్షన్స్ చూసిన తరువాత పరుచూరి వాళ్ళు రాసిన కథ సరిపోదని ఇంకా లోతుగా విశ్లేషణ చేయాలంటూ కథ బాధ్యతను సురేందర్ రెడ్డికి అప్పగించారు. ఆ మేరకు సురేందర్ రెడ్డి కూడా కర్నూల్ వెళ్లి అక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరిగిన ప్రాంతాలు, పోరాటం జరిపిన ప్రదేశాలు తిరిగి, వాళ్ళ కుటుంబసభ్యులను కూడా కలిసి ఆ కథని ఒక కొలిక్కి తీసుకువచ్చారు. ఇక కథ గురించి వివరాలు చెప్పినందుకు ఉయ్యాలవాడ వంశస్థులు రాయల్టీగా డబ్బులు అడిగారు అని, మనిషికి కి 15 లక్షల వరకు ఇవ్వడానికి రామ్ చరణ్ అండ్ చిరంజీవి ఒప్పుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఉయ్యాలవాడ వంశస్థులు ఆ అమౌంట్ తమకు సరిపోవడం లేదని 50 కోట్లు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఉయ్యాలవాడ వంశంలోని అయిదో తరానికి సంబంధించిన 23 మంది కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ‘సైరా’ నిర్మాత రామ్ చరణ్ పై, చిరంజీవిపై కూడా కేసు పెట్టారు. ఈ వివాదం సినిమా రిలీజ్ అయ్యే లోపు కొంచెం ఇబ్బందికరంగా మారేలా ఉంది.