ఓదార్పు యాత్ర అంటే టక్కున గుర్తొచ్చేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..! నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత.. ఆయన ఇకలేరని తెలుసుకుని కొన్ని వేల గుండెల ఆగిపోయాయి. దీంతో ఆ కుటుంబాలను ఓదార్చి, ధైర్యం చెప్పడానికి జగన్ శ్రీకారం చుట్టిన పయనమే ఓదార్పు యాత్ర. అయితే.. ఈ యాత్ర చేయడానికి వీల్లేదని నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అడ్డుపడటం, అయినా సరే వెళ్లి తీరాల్సిందేనని మొండిపట్టుతో ప్రజల్లోకి వెళ్లడం ఇదంతా అప్పట్లో పెద్ద సినిమాను మించే జరిగింది. అనుకున్నట్లుగానే వైఎస్ వారసుడు ఓదార్పు యాత్ర చేసి చూపించారు. అందుకే ఈ యాత్ర అనగానే వైఎస్ ఫ్యామిలీనే గుర్తొస్తుంది. అలాంటిది ఇప్పుడు మరోసారి ఓదార్పు యాత్రకు జగన్ రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే.. ఓదార్పు యాత్ర 2.0 అన్న మాట.
యాత్ర ఎందుకు..?
నాడు వైఎస్సార్ మరణం తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కుటుంబాల కోసం ఓదార్పు యాత్ర 1.0 చేస్తే.. నేడు 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని, వైసీపీ ఓటమి కారణంగా కుంగిపోయి మృతిచెందిన వారిని పరామర్శించాలని జగన్ నిర్ణయించినట్లు తెలియవచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ చివరి వారంలో లేదా.. జనవరిలో ఓదార్పు యాత్ర ఉంటుందని సమాచారం. గురువారం జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఓదార్పు యాత్రపై ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి కొడాలి నాని సైతం.. ఎవరూ అధైర్యపడొద్దని జగనన్న అందరినీ పరామర్శించి, అండగా ఉంటానని చెప్పడానికి ప్రజల్లోకి వస్తున్నారని మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ యాత్రతో కిందిస్థాయిలో ఉండే నేతలు, కార్యకర్తలకు భరోసా ఇవ్వడంతో పాటు రాజకీయ దాడులపై పోరాటానికి శ్రీకారం చుట్టినట్లు అవుతుందని వైసీపీ భావిస్తోంది. అంతేకాకుండా.. అధికార పార్టీ వరుస దాడులతో ప్రజాప్రతినిధుల్లో కూడా ధైర్యం నింపాలని యోచిస్తున్నట్లుగా అర్థమవుతోంది. మొత్తానికి చూస్తే.. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై జగన్ ఇలా ఫోకస్ పెట్టారన్న మాట.
2.0 అంతా సులువేం కాదబ్బా!
నాడు ఓదార్పు యాత్ర చేసిన సందర్భాలు వేరు.. కానీ నేడు పూర్తిగా వేరు..! ఎందుకంటే.. ప్రజల్లోకి వెళ్లాలంటే కచ్చితంగా పోలీసుల నుంచి అనుమతి తప్పనిసరి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ప్రతిసారీ పోలీసుల అనుమతి తప్పదు. అయినా నాడు ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు, టీడీపీ నేతలను.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను సైతం ఇదే పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్ ఏ రేంజిలో ఆటాడుకున్నారో అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతి రావడం అంత ఆషామాషీ అయితే కాదు. పైగా.. ఇప్పుడు ఏ నియోజకవర్గంలో చూసినా వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన కార్యకర్తలుగా పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జగన్ జనాల్లోకి వెళితే అనుకోకుండా ఆయనపై దాడి జరిగితే ఎవరిది బాధ్యత..? కచ్చితంగా ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉండొచ్చు..? అని సింపుల్‌గా అనుమతి ఇవ్వకుండా పోలీసులు తిరస్కరించవచ్చు కూడా. అంతేకాకుండా జగన్ ముప్పు పొంచి ఉందని ఒకే ఒక్క మాటతో సీన్ మొత్తం రివర్స్ చేసేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ అనుమతి ఇచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల చెంతకు ఎలాంటి గొడవలు, ఘర్షణలు, దాడులు లేకుండా జగన్ ఎలా వెళ్తారన్నది పెద్ద ప్రశ్నార్థకమే. సో.. ఓదార్పు యాత్ర 2.0 అంతా ఈజీ ఏం కాదు.. ఏం జరుగుతుందో చూడాలి మరి.