Telangana News: హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం మారి దాదాపు రెండు నెలలు కావోస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో మాటల తూటాల వర్షం కొనసాగుతోంది. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సహా ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు వంటి వారు బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఇంద్రవెళ్లి సభ నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించారు. మరోవైపు గులాబీ పార్టీ (BRS Party) నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీశ్ రావు, కవితలు హమీల అమలు పేరుతో టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవలే 17 పార్లమెంట్ నియోజకవర్గాల రివ్యూ పూర్తి చేసుకున్న గులాబీ పార్టీ ఇప్పుడు అసెంబ్లీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది.
మరోవైపు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫిబ్రవరి 17 తన పుట్టిన రోజు నుంచి పార్టీ కార్యకర్తలకు, ప్రజల మధ్యలోకి వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ఫిబ్రవరి నెల నుంచి పాలిటిక్స్ హీట్ పీక్స్ లోకి చేరుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మధ్య మధ్యలో బీజేపీ పార్టీ తనదైన శైలిలో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 10 నుంచి బీజేపీ తెలంగాణలో బస్ యాత్ర చేపడుతోంది. జాతీయ అగ్రనేతలు పాల్గొనేలా కార్యక్రమాలు సిద్దం చేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపైన పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత దృష్టా కమలం పార్టీ విమర్శలు ఎక్కుపెడుతూనే ఉంది. ఏది ఏమైనా తెలంగాణలో రాజకీయాలు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాగుతున్నాయి.
ప్రభుత్వం నిజంగా పడిపోతుందా… నిలబడుతుందా..?
గత కొద్ది రోజులగా బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు చూస్తుంటే ఐదేళ్ల పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో నిలబడటం కష్టమే అన్న రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి దీటుగా అటు కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం తమకు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ ప్రకటనలు చేస్తూ రాజకీయ కాక పుట్టిస్తున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తెలంగాణలో కలకలం రేపింది. అయితే తాము అభివృద్ధి నిమిత్తమే సీఎంను కలిశామని, అందులో తప్పేంటి అని ఎదురు ప్రశ్నలు వేయడంతో అంతా నిశబ్దమయినా.. ఎక్కడో ఏదో మూల రానున్న రోజుల్లో పొలిటికల్ గేమ్ ఏ మలుపు తీసుకుంటుందో.. అందుకు బీఆర్ఎస్ ముందు పావులు కదుపుతుందా లేక కాంగ్రెస్ నుంచి మొదలవుతుందా.. ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు సాగనున్నారను అన్న ఉత్కంఠ మాత్రం అందరిలో ఉంది.
ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 64 కాగా, సీపీఐతో కలుపుకుని 65 మాత్రమే. బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఎం.ఐ.ఎం 7,బీజేపీ 8 స్థానాల్లో గెలిచాయి. దీంతో ప్రభుత్వం బొటా బొటి మార్కులతో పాసయినట్లు చెప్పాలి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కొద్ది మంది ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకుని ప్రభుత్వాన్ని పడగొడుతుందా..లేక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను హస్తగతం చేసుకుని కాంగ్రెస్ నిలబడుతుందా అన్న ప్రశ్నలు సర్వత్రా తలెత్తుతున్నాయి.
పార్లమెంట్ ఎన్నికలే భవిష్యత్తు రాజకీయాలకు సూచిక….
ఈ నెలలోనే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అన్ని రాజకీయ పార్టీల భవిష్యత్తు ఏంటో తెలనుంది. పార్లమెంట్ లో 12 స్థానాలు గెలుపే లక్ష్యమని బీఆర్ఎస్ ప్రకటించింది. అదే రీతిలో పది నుంచి 14 సీట్లు గెలవాలని కాంగ్రెస్, రెండకల సీట్లే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల వ్యూహాలు ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ సీట్లను ప్రజలు కట్టబెడతారా అన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. బీజేపీ రామ మందిర నిర్మాణం కలిసి వస్తుందన్న ఆశతో ఉంటే, శాసన సభ ఎన్నికల ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని, తమకే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్ పట్టం కడతారని కాంగ్రెస్ ధీమాగా ఉంది. శాసన సభ ఎన్నికల్లో కొద్ది మంది ఎమ్మెల్యేలపై ఉన్న ప్రతికూలత వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలయిందని, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ పా ర్టీ అయిన బీఆర్ఎస్ కే ప్రజలు ఓటు వేస్తారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇలా మూడు పార్టీలు తమకు అనుకూల అంశాలతో ఎన్ని సీట్లు గెలుస్తామన్న లెక్కలు వేస్తున్నాయి.
ఆపరేషన్ ఆకర్ష్ పై సంయమనం పాఠిస్తున్న కాంగ్రెస్… బీఆర్ఎస్
పార్లమెంట్ ఎన్నికల ముందు ఏ పార్టీ కూడా ఆపరేషన్ ఆకర్ష స్టార్ట్ చేసేందుకు సిద్ధం గా లేదు. అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగినా, ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగినా పార్లమెంట్ ఎన్నికల ముందు పరిస్థితి బూమ్ రాంగ్ అవుతుందా అన్న టెన్షన్ ఇరు పార్టీల్లోను ఉంది. రెండు పార్టీలు కూడా వేచి చూసే ధోరణితో ఉన్నాయి. బీఆర్ఎస్ ను చీల్చి ఎమ్మెల్యేలను తాము చేర్చుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అది సానుభూతి మంత్రంగా పని చేస్తుందేమో అన్న ఆలోచనలో హస్తం నేతలు ఉన్నారు. ఇది తమకు ప్రతికూల ఫలితాలు ఇస్తుందేమో అన్న యోచనతో ఎన్నికల తర్వాతే ఏది చేయాలన్నా… అన్నట్లు వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు ఆ పార్టీ ముఖ్యనేతలు తమ అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజా అభిప్రాయాన్ని కాదని తాము అధికార పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటే ప్రభుత్వం పడిపోతుందని అది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటర్ పట్టం కట్టేందుకు దోహదం చేయడమే కాకుండా, తమ పార్టీ ప్రతిష్ట మరింత మసకబారే ప్రమాదముందని గులాబీ బాస్ అలోచిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నరు. అందుకే కాంగ్రెస్ పార్టీకి సమయం ఇచ్చి వేచి చూద్దామని ఆ పార్టీ వలలో పడవద్దని తమ ఎమ్మెల్యేలకు సూచించడం జరిగింది.
పార్లమెంట్ ఎన్నిక ఫలితాలే ఆపరేషన్ ఆకర్ష్ కు రూట్ మ్యాప్ కానుందా ?
ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ కావాలంటే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే రూట్ మ్యాప్ గా మారనున్నాయా అన్న చర్చ సాగుతోంది. ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో ఆ పా ర్టీ ముందుగా అంటే అది కాంగ్రెస్ అయినా, లేదా బీఆర్ఎస్ అయినా ఛాన్స్ తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు కట్టబెడితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ధైర్యం చేసే అవకాశం ఉంది. ఎక్కువ సీట్లు గెలవకపోయినా…. ఐదేళ్లు ప్రభుత్వం ఉండాలంటే బీఆర్ఎస్ ను చీల్చక తప్పని పరిస్థితి ఆ పార్టీకి ఉంటుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఫలితాల వరకు వేచి చూడాల్సిందే… ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన సీట్లు నిలబెట్టుకున్నా.. గులాబీ పార్టీ కాంగ్రెస్ ను పడగొట్టే ప్రయత్నాలు చేయవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల ఎమ్మెల్యేల పై ఉన్న వ్యతిరేకత వల్లే సీఎం పీఠం పొగొట్టుకున్నామన్న భావనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
ప్రస్తుత ఎంపీ సీట్లు అన్నీ దక్కించుకోగలగితే…. కేసీఆర్ తనదైన శైలిలో రాజకీయాలు చేసేందుకు ధైర్యంగా ముందుకు వస్తారని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా ప్రతికూలంగా ఉంటే ఆచి తూచి రాజకీయాలు చేయాల్సి ఉంటుందని గులాబీ నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ ను చీల్చక తప్పని పరిస్థితి కాంగ్రెస్ కు ఉంది. అలాగే అధికారంలో లేని పరిస్థితుల్లో ఐదేళ్లు పార్టీని కాపాడుకోవడం కూడా బీఆర్ఎస్ కు తలకు మించిన పనే అవుతుంది. కాబట్టి ఆపరేషన్ ఆకర్ష్ లేట్ అయినా… పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరో ఒకరు స్టార్ట్ చేయడం అనేది ఇరు పార్టీలకు తప్పనిసరి పరిస్థితి. అయితే ముందుగా పావులు ఎవరు కదుపుతారు…కాంగ్రెస్సా, బీఆర్ఎస్సా అన్నది చూడాలి. అంతే కాకుండా… బీజేపీ, ఎం.ఐ.ఎం స్టాండ్ రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో అన్నది కూడా ఆసక్తి కరమే. ఏది ఏమైనా… పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులు సంభవించడం మాత్రం ఖాయం.
మరిన్ని చూడండి