అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వీలైనంత త్వరగా సిద్ధం చేస్తామన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్ ఇన్ చార్జ్ మాణిక్ రావ్ థాక్రే. అతి త్వరలో తొలి జాబితాను విడుదల చేస్తామన్న ఆయన, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ జాబితాను ఖరారు చేస్తుందన్నారు. వివిధ సామాజికవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయన్న ఆయన, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ నుంచి ఒక జాబితా వచ్చిందని తెలిపారు.
అన్ని వైపుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించామన్న మాణిక్ రావ్ థాక్రే, అన్నివర్గాలకు తగినంత ప్రాతినిథ్యం లభించేలా చూస్తున్నామని వెల్లడించారు. టికెట్ల ఖరారులో తుది నిర్ణయం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీదేనన్న మాణిక్ రావ్ థాక్రే, సీఈసీ సమావేశం కంటే ముందు మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుందన్నారు.
మరోవైపు కాంగ్రెస్‌లో టికెట్ ఆశిస్తున్న ఆశావహులు గళం పెంచారు. హస్తినకి చేరుకుంటున్న నేతలు అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీట్ల ఎంపికకోసం కసరత్తు జరుగుతున్న వార్‌రూమ్ ముందు ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. రాహుల్‌గాంధీ సూచనలు స్క్రీనింగ్ కమిటీ పరిగణనలోకి తీసుకొని ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులకు న్యాయం చేయాలని, ఓయూ విద్యార్థుల టికెట్ల అంశంపై స్క్రీనింగ్ కమిటీలో చర్చ జరగాలంటూ నినాదాలు చేశారు.
ఇటు షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయాలని స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ ను కోరినట్లు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ తో భేటీ అయిన ఆయన, యువజన కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్నారు. పార్టీ ప్రతి కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నేతలు కష్టపడుతున్నారని, కేసులను ఎదుర్కొంటూ పార్టీ కోసం పని చేస్తున్నారని తెలిపారు. యువతకు సీట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఉండాలని, టికెట్ల కేటాయింపులో మహిళలకు మంచి కోటా రాబోతుందన్నారు.
అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్‌లకు బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్న కోమటిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. సింగిల్ అభ్యర్థి సీట్లను ఫైనల్ చేయాలని మురళీధరణ్ కు విజ్ఞప్తి చేసినట్లు కోమటిరెడ్డి తెలిపారు. ఆదివారం జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో 90 శాతం కసరత్తు పూర్తి చేసి, సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించాలని సూచించానన్నారు. సాధ్యమైనంత త్వరగా సీఈసీ మీటింగ్ అయ్యేలా చూడాలని కోరినట్లు వెల్లడించారు. ఎన్నికలకు సమయం లేదని, అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ అయితే, వారంతా నియోజకవర్గాలకు వెళ్లి పని చేస్తారని తెలిపారు.