హైదరాబాద్ మీర్ పేటలో అధికార పార్టీ కార్పొరేటర్ భర్త రెచ్చిపోయాడు. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ 39వ వార్డు కార్పొరేటర్ సురేఖ భర్త రమేష్ మడారి… ఓ ఆటో డ్రైవర్ పై దౌర్జన్యానికి పాల్పడి దాడి చేశాడు. ఇంట్లో ఉన్న ఆటో డ్రైవర్ బయటకు పిలిచి మరి ఆటోను రోడ్డుపై ఎందుకు పార్క్ చేశావంటూ బూతులు తిట్టాడు. ఇష్టమొచ్చినట్లు బూతుపురాణం అందుకున్నాడు. తన ఇంటి ముందు ఆటో డ్రైవర్ బండి పార్క్ చేసినందుకు రెచ్చిపోయాడు. రౌడీలా ఆటో డ్రైవర్ షర్ట్ పట్టుకొని దాడికి పాల్పడ్డాడు. ఎందుకు కొడుతున్నావని ప్రశ్నిస్తే అధికార పార్టీ కార్పొరేటర్ నని, ఏం చేసుకుంటావో చేసుకోమంటూ వార్నింగ్ ఇచ్చాడు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు చెప్పుకొని రౌడీయిజం చేస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ ఏడాది జనవరిలో ఇదే మీర్ పేట మున్సిపల్ కార్పొరేష కార్పొరేటర్ అరుణ భర్త జిల్లెల ప్రభాకర్ రెడ్డి అర్థరాత్రి వీరంగం సృష్టించాడు. రాత్రి 10 గంటలకు బైక్ పై వెళుతున్న బలరాం అనే వ్యక్తిని ఢీ కొట్టాడు. అతని బైక్ పై ఉన్న మరో వ్యక్తిపై కూడా దాడి చేశాడు. దాడి వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనపై బాధితుడు బలరాం మీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బలరాం తన వాహనానికి అడ్డుకుని తనపై దాడికి యత్నించాడని.. కులం పేరుతో దూషించాడని ఆరోపించారు. జిల్లెల ప్రభాకర్ రెడ్డి కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుడే.
గతేడాది హైదరాబాద్ మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ విజయలక్ష్మి భర్త రాజు హల్ చల్ చేశారు. జనప్రియ మహానగర్ లో తన షాపు ముందు.. కారుకు అడ్డంగా వాహనాన్ని పార్క్ చేసినందుకు కృష్ణ అనే వ్యక్తిపై దాడికి దిగారు. అలా ఎలా పార్క్ చేస్తావంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. వాహనం పార్కింగ్ చేసిన వ్యక్తిని కొట్టుకుంటూ బయటకు తీసుకొచ్చాడు రాజు ముదిరాజ్. సీసీటీవీ ఆధారంగా పోలీసులు కేసు పెట్టారు.