Secunderabad: ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపామున్షీ, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా హస్తం గూటికి చేరారు. వారిద్దరికి దీపామున్షి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధిగా దానం నాగేందర్ పోటీ చేస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే లోక్‌సభ ఎన్నికల సమయంలో దానం నాగేందర్ హస్తం పార్టీలో చేరారనే చర్చ నడుస్తోంది. ఈ వార్తలపై దానం నాగేందర్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయడం లేదని, మీడియాతో జరిగే ప్రచారం అవాస్తవమని దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం కార్యకర్తలు, అనుచరులతో దానం భేటీ అయ్యారు. వారితో చర్చించిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉంది. ఈ సారి మరోసారి సికింద్రాబాద్ నుంచి బీజేపీ తరపున కిషన్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఆయనకు బీజేపీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. ఇక బీఆర్ఎస్ తరపున తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్‌కు టికెట్ ఖరారు అయింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరిదనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
కిషన్ రెడ్డిక పోటీ ఎవరంటే.. ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి ఎవరూ లేరు. దీంతో దానం నాగేందర్‌ను బరిలోకి దింపాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలను దానం ఖండిస్తున్నారు. తొలుత ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను సికింద్రాబాద్ నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావించింది. కానీ కిషన్ రెడ్డికి పోటీగా బలమైన నేతను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగా దానం నాగేందర్ పేరును పరిశీలించినట్లు వార్తలొస్తున్నాయి. దానం నాగేందర్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు.
కాంగ్రెస్ ఛాన్స్ ఇచ్చేది ఎవరికో? రాజకీయాల్లో సీనియర్ నేతగా దానం నాగేందర్‌కు పేరుంది. దీంతో కిషన్ రెడ్డికి పోటీగా ఆయన అయితే బాగుంటుందని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. కానీ దానం మాత్రం పోటీకి దిగేందుకు ఆసక్తిగా లేరని చెబుతున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే తొలి జాబితాలో తెలంగాణ నుంచి నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నల్లగొండ నుంచి కందూరు రఘువీర్ రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి చల్లా వంశీచందర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, జహీరాబాద్ నుంచి సురేశ్ కుమార్ షేట్కర్ పేర్లను ఖరారు చేసింది. సోమవారం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో మూడో జాబితాపై చర్చించి ఆమోదం తెలపనుంది. అనంతరం మూడో జాబితాను ప్రకటించే అవకవాశముందని తెలుస్తోంది.
మూడో జాబితాలో తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించనున్నారని హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా ఈ జాబితాలో చోటు దక్కే అవకాశముందని తెలుస్తోంది. ఇక చేవెళ్ల ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరినా ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలుస్తోంది. ఏఐసీసీలో ఆయనకు ఏదైనా కీలక పదవి కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని చూడండి
Source link