England Announce Playing 11 For IND vs ENG 4th Test In Ranchi: భారత్-ఇంగ్లండ్(IND vs ENG) మధ్య నాలుగో టెస్టుకు రంగం సిద్ధమైంది. రాంచీ వేదికగా శుక్రవారం ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో 434 పరుగుల భారీ తేడాతో గెలుపొంది….జోరు మీదున్న భారత్ నాలుగో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్ దక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలానైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ఇంగ్లండ్ ఆశిస్తోంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ టెస్టులో గెలిచి సిరీస్ సమం చేయాలనే లక్ష్యంతో ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో రాంచీ టెస్టుకు బ్రిటీష్ టీం తుది జట్టును ప్రకటించింది. ఇప్పటికే వరుసగా రెండు టెస్టులు ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టు.. రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. పేసర్ మార్క్‌వుడ్‌ను పక్కన పెట్టిన ఇంగ్లాండ్ బోర్డు ఓలీ రాబిన్‌సన్‌ను జట్టులోకి తీసుకుంది. అండర్సన్‌కు మరోసారి అవకాశం దక్కింది. షోయబ్ బషీర్ మళ్లీ తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్ ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతోనే బరిలోకి దిగింది.
నాలుగో టెస్ట్‌కు ఇంగ్లాండ్ ఫైనల్ 11:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్ స్టో, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్ట్‌లీ, ఓలీ రాబిన్‌సన్, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్
టీమిండియాలో ఆకాశ్‌దీప్
నాలుగో టెస్ట్ నుంచి టీమిండియా పేసు గుర్రం జస్ప్రిత్ బుమ్రాకు విశ్రాంతి లభించడంతో బెంగాల్ ఫాస్ట్‌బౌలర్ ఆకాశ్‌దీప్ రాంచిలో జరిగే నాలుగో టెస్టులో అరంగేట్రం చేసే అవకాశముందన్న వార్తలు వస్తున్నాయి. సిరాజ్‌తోపాటు పేస్ బాధ్యతలను పంచుకునేందుకు ఈ యంగ్ స్టార్ సిద్ధంగా ఉన్నాడు. అయితే ముకేశ్ కుమార్‌తో ఆకాశ్‌దీప్‌కు పోటీ నెలకొంది. కానీ జట్టు మేనేజ్‌మెంట్ ఆకాశ్‌దీప్ వైపే మొగ్గుచూపొచ్చు. భారత్-ఎ, ఇంగ్లాండ్ లయన్స్ మధ్య మ్యాచ్‌ల్లో అతడి బౌలింగ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లను ఆకట్టుకుంది. లయన్స్‌తో రెండు మ్యాచ్‌ల్లో అతడు పది వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్‌దీప్ ఇప్పటివరకు 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 104 వికెట్లు చేజిక్కించుకున్నాడు. విశాఖలో జరిగిన రెండో టెస్టులో 12 ఓవర్లు బౌలింగ్ చేసిన ముకేశ్.. ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు.
నాలుగో టెస్ట్‌కు బుమ్రా దూరం, రాహుల్ కూడా
రాంచీ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ర్పిత్ బుమ్రా(Bumrah) ఆడడం లేదు. పని భారం ఎక్కువ అవుతుండడంతో కీలకమైన నాలుగో టెస్ట్‌కు బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. బుమ్రాను నాలుగో టెస్ట్‌లో జట్టులోకి తీసుకోలేదని… టెస్టు సిరీస్ వ్యవధి, ఇటీవల కాలంలో అతడి పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ ప్రకటించింది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రాకు రాంచీ టెస్టు నుంచి విశ్రాంతినిచ్చినట్టు బీసీసీఐ(BCCI) ప్రకటించింది. ఈ టెస్టు బరిలోకి దిగుతాడనుకున్న కేఎల్ రాహుల్(K L Rahul) కూడా జట్టుకు దూరమైనట్టు బోర్డు తెలిపింది. రాహుల్ ఐదో టెస్టులోనూ ఆడేది లేనిది అతడి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని బోర్డు వెల్లడించింది. కేఎల్ రాహుల్ నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. ఫిట్‌గా ఉంటే ఆఖరి టెస్టులో ఆడతాడని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. శుక్రవారం రాంచీలో ఆరంభమయ్యే నాలుగో టెస్టు కోసం బుమ్రా స్థానంలో ముకేశ్ కుమార్ జట్టుకు ఎంపికయ్యాడు. బుమ్రా 17 వికెట్లతో ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. బుమ్రా ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి మూడు టెస్టుల్లో 80 ఓవర్లు బౌలింగ్ చేశాడు.