Secunderabad Cantonment Sainik School: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో కొత్త సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలనే యోచనలో కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. అక్కడ పాఠశాలలను నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్ ఇటీవల కలిసి వినతిపత్రం అందజేశారు.
సైనిక్ స్కూల్‌ను మంజూరు చేయడంతోపాటు పాఠశాలలకు అవసరమైన 50 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించాలని, అందుకు బదులుగా వేరే చోట రక్షణ శాఖకు స్థలం ఇస్తామని మంత్రి వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం. కేంద్రం కూడా సుముఖంగా ఉండటంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి విద్యాశాఖ అధికారులతో చర్చించారు.
పూర్తిస్థాయి గురుకులం తరహాలోనే కొత్త సైనిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు కేంద్రానికి సమర్పించేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఆరేళ్ల క్రితం వరంగల్‌కు సైనిక్ స్కూల్ మంజూరు కాగా…ఆనాడు స్థలం కాకుండా రూ.100 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పుడు అది ఇంకా పెరగొచ్చని భావిస్తున్నారు.
ALSO READ:
జనవరి 28న సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష, హాల్‌టికెట్లు విడుదల
దేశంలోని సైనిక పాఠశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు సంబంధించి జనవరి 28న ‘అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE-2024)’ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే విడుదల చేసింది. జనవరి 28న ఆరోతరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దార్ఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.
AISSEE – 2024 అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం..
➥ పెన్ పేపర్ (ఓఎంఆర్ షీట్) విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించే మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఆబ్జె్క్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి.
➥ 6వ తరగతి ప్రవేశాలు కోరే విద్యార్థులకు మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు- ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు; ఇక ఇంటెలిజెన్స్, లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం 2.30 గంటలు (150 నిమిషాలు).
➥ 9వ తరగతిలో ప్రవేశాలు కోరే విద్యార్థులకు 400 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు-ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు; ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ సజ్జెక్టుల నుంచి 25 ప్రశ్నలు-ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు (180 నిమిషాలు).
➥ 9వ తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో; 6వ తరగతి విద్యార్థులు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష రాసే వెసులుబాటు ఉంది.