Free Bus Journey For Gents In Hyderabad: తెలంగాణలో మహలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది ప్రభుత్వం. దీంతో మహిళా ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. నిత్యం బస్సులు కళకళలాడుతున్నాయి. రద్దీ కూడా ఊహించినదాని కంటే ఎక్కువగా ఉంది. దీనిపై సర్వత్రా విమర్శలు కూడా వస్తున్నాయి. మహిళా ప్రయాణికులు కారణంగా పురుషులు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం ప్రత్యేక బస్‌లు వేయాలన్న డిమాండ్ ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోంది. కొన్ని డిపోల్లో ఆ ప్రయత్నాలు కూడా జరిగాయి.
హైదరాబాద్‌లో మహిళలకే కాదు పురుషులకి కూడా ఉచితంగా బస్ సర్వీసులు నడుస్తున్నాయి. మీరు విన్నది నిజమే. హైదరాబాద్‌లో ఫ్రీగా తిరగాలనుకునే వారికి మంచి ఆఫర్ ఇది అని చెప్పవచ్చు. గతేడాది హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి వచ్చిన డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రజలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. నగరంలోని పర్యాటక ప్రదేశాలను చూసి రావచ్చు. రూ.12.96 కోట్లతో గతంలోనే ఆరు డబుల్ డెక్కర్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను హెచ్‌ఎండీఏ కొనుగోలు తిప్పుతోంది.
హైదరాబాద్‌లో చాలా చోట్ల ఫ్లైఓవర్లు, మెట్రో స్టేషన్లు ఉన్నందున బస్సుల ఎత్తు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎత్తు విషయంలో ఇబ్బంది రాకుండా ఎట్టకేలకు కొన్ని రూట్లు ఎంపిక చేసి తిప్పుతున్నారు. ట్యాంక్‌బండ్, బిర్లా మందిర్, అసెంబ్లీ ఏరియాలోనే ప్రస్తుతానికి బస్సులు తిరుగుతున్నాయి. సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కా మసీదుతోపాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్, తీగల వంతెన, దుర్గం చెరువు, గండిపేట పార్కు, గోల్కొండ, తారామతి బారాదరి తదితర ప్రాంతాల్లో కూడా డబుల్ డెక్కర్ బస్సులు నడుపుతున్నారు.
ఉదయం ట్యాంక్ బండ్ వద్ద బయలుదేరి ఆయా రూట్లలో తిరుగుతూ తిరిగి ట్యాంక్ బండ్‌కు ఈ బస్సులు చేరుకుంటాయి. ఛార్జింగ్ కోసం ఖైరతాబాద్ లోని సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ), సంజీవయ్య పార్కులో ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి టిక్కెట్ అవసరం లేకుండా ఈ బస్సుల్లో ఎవరైనా తిరగొచ్చు. త్వరలోనే వీటికి కూడా టికెట్ వసూలు చేసే ఛాన్స్ ఉంది. అందుకే ఆ లోపే మీరు ఫ్రీగా డబుల్ డెక్కర్‌లో సిటీని చుట్టేయండి.
ఒకప్పుడు హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతుండేవి. ఆ పాత మధుర జ్ఞాపకాలు నేటి తరానికి మళ్లీ పరిచయం చేసేందుకు ఈ డబుల్ డెక్కర్ బస్సులు రోడ్లపైకి తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం. ఒక్కో బస్సు కనీసం రూ.10 కోట్లు ఖర్చు పెట్టి కొన్నట్టు అప్పట్లో న్యూస్ వైరల్ అయింది. 2006 వరకు హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు కనిపించాయి. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా జూ పార్కు వరకు, సికింద్రాబాద్ – అఫ్జల్‌గంజ్ వరకు, సికింద్రాబాద్ – మెహిదీపట్నం ఆకుపచ్చ రంగులో ఉండే రెండు అంతస్తుల బస్సులు నడిచేవి. వీటిలో ఒక డ్రైవర్, ఇద్దరు కండక్టర్‌లు విధులు నిర్వహించేవారు. నగరంలో వచ్చిన మార్పులు కారణంగా ఆ బస్సులును ఆపేశారు. ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చారు. ప్రస్తుతానికి వీటిలో ఉచితంగానే తిరిగే ఛాన్స్ కల్పిస్తున్నారు.
మరిన్ని చూడండి