Afghanistan Lost but won hearts : అది అఫ్గానిస్థాన్(Afghanistan) రాజధాని కాబూల్‌లోని క్రికెట్ మైదానం. తెల్లవారుజామున అయిదు గంటలకే అక్కడ చాలామంది ప్రజలు గుమిగూడారు. వందలాది మంది యువకులు అఫ్గాన్ క్రికెట్ జట్టుకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. మీరంతా అక్కడ ఏదో క్రికెట్ మ్యాచ్ జరగబోతుందని అనుకున్నారు కదా. కాదు దక్షిణాఫ్రికాతో జరిగిన టీ 20 ప్రపంచకప్ సెమీస్‌ను భారీ తెరపై వీక్షించేందుకు భారీగా అభిమానులు కాబూల్ మైదానం వద్దకు చేరుకున్నారు. తోసుకుంటూ స్టేడియంలోకి వెళ్లి మ్యాచ్‌ను వీక్షించారు. ఓ మ్యాచ్‌ను చూసేందుకు వందలాది మంది అభిమానులు కాబూల్‌లోని మైదానానికి రావడం ఒక ఎత్తైతే… మ్యాచ్ అఫ్గాన్ ఓడిపోయిన తర్వాత కూడా వారంత తమ జట్టు టీ 20 ప్రపంచకప్‌లో చేసిన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేయడం మరో ఎత్తు. ఉదయం 5 గంటలకు బంధువులు, క్లాస్‌మేట్స్‌తో కలిసి కాబుల్ స్టేడియానికి వచ్చానని.. స్టేడియం ముందు చాలా పొడవైన క్యూ ఉందని… లోపలికి వచ్చేందుకు గంట సమయం పట్టిందని కాబూల్ విశ్వవిద్యాలయ విద్యార్థి జైద్ దిదార్ తెలపడం అక్కడ ఎంత రష్ ఉందో చెప్పేందుకు ఒక ఉదాహరణ.
సమస్యలపై ఆటతో యుద్ధం
సమస్యలు సుడిగండంలో చిక్కుకుని… ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్‌లో ఇది క్రికెట్(Cricket) తెచ్చిన మార్పు. అఫ్గాన్ క్రికెట్ జట్టు తెచ్చిన మార్పు. ప్రజలందరూ గత రెండు వారాలుగా టీ 20 ప్రపంచకప్‌లో అఫ్గాన్ ఆట గురించే మాట్లాడుకుంటున్నారంటే అది అతిశయోక్తి కాదు. అందుకే అందరూ ఎప్పుడూ అనేలా… అఫ్గాన్ క్రికెట్ జట్టు అభిమానుల మనసులు గెలుచుకుంది. అది అలా ఇలా కాదు. తమ దేశ క్రికెట్ భవిష్యత్తును మార్చేంతగా అఫ్గాన్ జట్టు ఈ ప్రపంచకప్(T20 World Cup)లో అదరగొట్టింది. అప్గాన్‌లో తాలిబన్ల పాలనపై వినోదంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. సినిమాలపై కూడా ఇవే ఆంక్షలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కాబూలీలకు క్రికెట్టే వినోదంగా మారింది. అఫ్గాన్ పిల్లలకు క్రికెట్ తప్ప మరో లోకం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో రషీద్ ఖాన్ నేతృత్వంలోని క్రికెట్ జట్టు టీ 20 ప్రపంచకప్‌లో అద్భుతాలు సృష్టించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లకు షాక్ ఇస్తూ సెమీస్‌కు దూసుకొచ్చి తమ దేశ ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసింది.
ఫలితం ఎలా ఉన్నా…
దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో ఫలితం ఎలా ఉన్నా ఈ టీ20 ప్రపంచకప్‌లో అప్గాన్ క్రికెట్ జట్టు ప్రయాణాన్ని చూసి ఆ దేశ అభిమానులు మురిసిపోతున్నారు. ఈ T20 ప్రపంచ కప్‌లో తాము ఆశించిన ముగింపు దక్కలేదని… కానీ ఈ మెగా టోర్నీలో తమ జట్టు మరచిపోలేని ప్రదర్శన చేసిందని… వారు తమని గర్వించేలా చేశారని ప్రొటీస్‌తో మ్యాచ్ తర్వాత ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ ప్రపంచకప్‌లో అప్గాన్ క్రికెట్ జట్టు తమకు సంతోషాన్ని తీసుకువచ్చిందని… జట్టులోని ప్రతీ ఆటగాడికి ధన్యవాదాలను మరో యూనివర్సిటీ విద్యార్థి సంతోషం వ్యక్తం చేశాడు. తమ దేశానికి సంతోషం కలిగించేది క్రికెట్ ఒక్కటేనని… తమకు ఆనంద క్షణాలు చాలా తక్కువని… ఇప్పుడు తమ జట్టు తమకు పట్టలేని సంతోషాన్ని ఇచ్చిందని మరో కాబూలీవాలా ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
మరిన్ని చూడండి