ByMohan
Sat 20th Jan 2024 10:52 PM
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనగానే ఇంకేముంది? అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఇక మీదట పాతాళానికి కూరుకుపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఈ పథకానికి ఏ ముహూర్తాన మహాలక్ష్మి అని పేరు పెట్టారో కానీ నిజంగా సిరులు కురిపించేసింది. సంక్రాంతి సీజన్‌లో ఎన్నడూ లేని విధంగా రూ.350 కోట్ల ఆదాయాన్ని సంపాదించి పెట్టింది. సంక్రాంతి సందర్భంగా 50 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. డైనమిక్ ఫేర్ సిస్టమ్ పేరుతో ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేసింది. దీంతో ఆర్టీసికి సిరుల పంట పండింది.
ఆర్టీసీ మరింత నష్టాల్లో కూరుకుపోతుందనుకున్నారు..
గత ఏడాది ఇవే 18 రోజుల్లో ఆర్టీసీ ఆదాయం 245 కోట్ల రూపాయలు మాత్రమే వస్తే ఈ ఏడాది ఏకంగా రూ.105 కోట్లు అదనంగా వచ్చాయి. ఇది కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగానే సాధ్యమైందట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. దీనిని రేవంత్ ఎంతో కాలం కొనసాగించలేరని.. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ మరింత నష్టాల్లో కూరుకుపోతుందని అంతా అనుకున్నారు. ప్రతిపక్షాలు సైతం ఇదే విమర్శలు గుప్పించాయి. అయితే సంక్రాంతి పండగ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. అయితే ఈ బస్సుల్లో సైతం మహిళలకు జీరో టికెట్‌ను అనుమతించారు.
డైనమిక్ ఫేర్ సిస్టమ్‌తో అదనపు లాభాలు..
బస్సుల్లో ఉచితం కాబట్టి మహిళలంతా బస్సు ప్రయాణాన్నే ఎంచుకున్నారు. మరి వీరు బస్సుల్లో వస్తుంటే.. వీరి కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనాల్లో వెళ్లరు కదా.. అందుకే వారంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సాగించారు. అంతేకాకుండా.. పండగ సీజన్ సందర్భంగా నడిపిన సూపర్ లగ్జరీ, గరుడ బస్సుల్లో డైనమిక్ ఫేర్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. అంటే ప్రయాణీకుల రద్దీ తక్కువగా ఉంటే సాధారణ ఛార్జీలు.. రద్దీగా ఉన్న సమయంలో ఎక్కువ ఛార్జీలను వసూలు చేసింది. అయితే ప్రైవేట్ ట్రావెల్స్‌తో పోలిస్తే డైనమిక్ ఫేర్ తక్కువ. దీంతో ఎక్కువ మంది ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించారు. ఇదేమీ కొత్తగా ప్రవేశ పెట్టలేదు. గత దసరా సందర్భంగా కూడా ఈ సిస్టమ్‌నే ప్రవేశపెట్టారు. కానీ ఈసారి మహాలక్ష్మి పథకం కూడా తోడవడంతో ఆర్టీసీకి సిరులు కురిశాయి.
Full Collections to TSRTC with Mahalakshmi Scheme:
Mahalakshmi Scheme Grand Success