Gautam Gambhir on Team India Head Coach post : టీమిండియా(Team India) నూతన ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్(Gautam Gambhir) దాదాపుగా ఎంపికయ్యాడని వార్తలు చెలరేగుతున్న వేళ తొలిసారి దీనిపై గంభీర్ పెదవి విప్పాడు. ఇప్పటివరకూ ఎప్పుడూ భారత జట్టు ప్రధాన కోచ్ పదవిపై మాట్లాడని గంభీర్ తొలిసారి దీనిపై స్పందించాడు. గంభీర్ టీమిండియా హెచ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు అంతా సిద్ధమైందని… రాహుల్ ద్రవిడ్(RAhul Dravid) స్థానంలో గంభీర్ ఎంపిక లాంఛనమేనని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో స్పందించిన గంభీర్… తాను ఇంకా అంత దూరం చూడడం లేదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టేంత దూరం గురించి తాను ఆలోచించడం లేదని గంభీర్ అన్నాడు.
గంభీర్ ఏమన్నాడంటే..?
భారత క్రికెట్ జట్టు తదుపరి ప్రధాన కోచ్‌గా తాను ఎంపిక కాబోతున్నారా అన్న మీడియా ప్రశ్నలను గౌతం గంభీర్ దాటవేశాడు. భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టేంత దూరాన్ని తాను ఇంకా చూడడం లేదని అన్నాడు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ‘రైజ్ టు లీడర్‌షిప్’ సెమినార్ కార్యక్రమంలో మాట్లాడిన గంభీర్… టీమిండియా కోచ్ పదవిపై తనను ఇబ్బంది పెట్ట ప్రశ్నలు అడుగుతున్నారని అన్నాడు. ఇటీవలే BCCI క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్వహించిన వర్చువల్ ఇంటర్వ్యూలో గౌతం గంభీర్ పాల్గొన్నాడు. దీంతో భారత జట్టు ప్రధాన కోచ్‌గా గంభీర్ ఎంపికను క్రికెట్ అడ్వైజరీ కమిటీ దాదాపు ఖరారు చేసిందని వార్తలు వచ్చాయి. వెస్టిండీస్‌లో జరుగుతున్న T20 ప్రపంచ కప్ తర్వాత ప్రస్తుత హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత నూతన కోచ్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. భారత జట్టు తదుపరి ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్ నియామకానికి బీసీసీఐ పచ్చా జెండా ఊపినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే మెంటార్‌గా కోల్‌కత్తాకు మూడో ఐపీఎల్ టైటిల్ అందించిన గంభీర్… కోచ్ రేసులో ముందున్నాడు. టీమిండియా హెచ్ కోచ్ పదవిపై ప్రస్తుతం సమాధానం చెప్పడం కష్టమని… తాను ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉన్నానని మాత్రమే చెప్పగలనని గంభీర్ అన్నాడు. ఇటీవలే ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ముగించానని… దానిని ఆస్వాదిద్దామని గంభీర్ అన్నాడు. ప్రస్తుతం తాను చాలా సంతోషకరమైన ప్రదేశంలోనే ఉన్నానని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
టీమ్ ఫస్ట్ నినాదమే నా ఫిలాసఫీ
తనకు టీమ్ ఫస్ట్ ఫిలాసఫీనే గురు మంత్రమని గంభీర్ అన్నాడు. టీమ్-ఫస్ట్ ఐడియాలజీ, టీమ్-ఫస్ట్ ఫిలాసఫీ అనేది ఏ స్పోర్ట్‌లో అయినా చాలా ముఖ్యమైన ఐడియాలజీ అని గంభీర్ తెలిపాడు. కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టును గెలిపించడమే తన పని అని అది దిగ్విజయవంతంగా పూర్తయిందన్నాడు. కేకీఆర్‌లో ప్రతీ ఒక్కరూ అని గంభీర్ చెప్పాడు. కోల్‌కత్తాకు ఏదైనా తిరిగి ఇవ్వడం తన బాధ్యతని అదే చేశానని గంభీర్ అన్నాడు. జట్టులోని సభ్యులందరినీ సమానంగా చూడడం తన విధానమని చెప్పాడు. క్రికెట్‌లో 11 మందిని సమానంగా చూస్తేనే… సమానంగా గౌరవిస్తే, ఒకే బాధ్యత, ఒకే గౌరవం ఇస్తే, మీరు నమ్మశక్యం కాని విజయాన్ని సాధిస్తారని గంభీర్ హిత బోధ చేశాడు. భారత్‌కు కెప్టెన్‌గా కొనసాగలేకపోయినందుకు తనకు ఎలాంటి నిరాశ లేదని గంభీర్ అన్నాడు. ఆరు మ్యాచ్‌లకు భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించానని ఆ గౌరవం తనకు చాలని గంభీర్ అన్నాడు. కానీ 2011 ప్రపంచకప్ ఫైనల్లో చివరిదాక క్రీజులో నిలబడి ఉంటే బాగుండేదని తెలిపాడు. ఒకవేళ కాలం వెనక్కి వెళ్తే 2011 ప్రపంచకప్ పైనల్లో జట్టును గెలిపించే బయటకు వస్తానని గంభీర్ అన్నాడు.
మరిన్ని చూడండి