Telangana News: గత ప్రభుత్వ హయాంలో భూములు కేటాయించినా ఇంకా పరిశ్రమలు స్థాపించని సంస్థల నుంచి భూములు వెనక్కి తీసుకోవాలని తెలంగాణ (Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇండస్ట్రియల్ భూముల పరిరక్షణ పై ఫోకస్ పెట్టిన రేవంత్ (Revanth Reddy) సర్కార్…డివిడెండ్, షేర్ హోల్డ్ అమౌంట్ చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈడీ (ED) కేసులు, ఇతరత్ర వ్యవహారాల్లో కోర్ట్ లో ఉన్న భూములపై న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) వెల్లడించారు.
పరిశ్రమల భూములు వెనక్కి
రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణ, అభివృద్ధిపై టీఎస్ఐఐసి(Ts iic) అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. టీఎస్ ఐఐసీ సంస్థ కార్యకలాపాలు, విభాగాల పనితీరు, ల్యాండ్ బ్యాంకు, భూకేటాయింపులు, వాటి వినియోగం తదితర అంశాలపై పరిశ్రమల శాఖ అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు . రాష్ట్ర విభజనకు ముందు జరిగిన భూకేటాయింపులు, తర్వాత జరిగిన కేటాయింపుల పైనా మంత్రి ఆరా తీశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏయే సంస్థలకు ప్రభుత్వం ఎంతెంత భూమి ఇచ్చింది. వారు ఆయా భూముల్లో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేశారు…నిరూపయోగంగా ఉన్న భూమి ఎంత అనే వివరాలు అధికారులు మంత్రికి వివరించారు. ఏళ్లు గడుస్తున్నా పరిశ్రలు ఏర్పాటు చేయని భూములపై ఆరా తీశారు. అలాంటి వాటిని గుర్తించి భూములు వెనక్కి తీసుకోవాలని అధికారులకు మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు.
ఈడీ జప్తు చేసిన భూములపై దృష్టి
భూములు పొందిన సంస్థలు వారి ప్రయోజనాలకు కాకుండా థర్డ్ పార్టీలకు లీజుకు ఇవ్వడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా థర్డ్ పార్టీలకు జరిగిన లీజు అగ్రిమెంట్లు, పొందుతున్న ఆదాయం అంశాలపై నివేదిక సమర్పించాలని సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించారు. గతంలో భూములు పొంది, ఈడీ , సిబిఐ లాంటి సంస్థలు జప్తు చేసిన భూములపై హక్కు తిరిగి పొందేలా న్యాయస్థానాల్లో పోరాటం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జాయింట్ వెంచర్ లో భాగంగా పలు సంస్థలు, కంపెనీలు డివిడెండ్, షేర్ హోల్డ్ అమౌంట్ చెల్లించని అంశాలపై మంత్రి శ్రీధర్‌బాబు ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఏర్పాటు జరిగిన పలు పారిశ్రామిక పార్కుల ప్రస్తుత పరిస్థితిపై సంస్థ అధికారులు మంత్రికి వివరించారు.
అధికారులపై ఆగ్రహం
పరిశ్రమలశాఖలో కొందరు అధికారులు ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండటం లేదని…ముఖ్యంగా టీఎస్ఐఐసి అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని హెచ్చరించారు. చాలా జిల్లాల్లో అధికారులు అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రతి అధికారి ఫీల్డ్ విజిట్ చేసి కేటాయించిన భూములు, సంబంధిత కంపెనీ వినియోగించ భూమి గురించి విచారణ చేపట్టాలన్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి భూమి పొంది కూడా ఇప్పటి వరకు పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడానికి కారణాలను అడిగి తెలుసుకుని వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. గత ప్రభుత్వం హయాంలో ఇష్టానుసారం అనుయాయులకు విలువైన భూములు కేటాయించారని….కోట్లాది రూపాయల భూములు నిరూపయోగంగా పడి ఉన్నాయన్నారు. అలాంటి భూములను గుర్తించి వెనక్కి తీసుకుంటామన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే సంస్థలకే భూములు కేటాయిస్తామని మంత్రి తెలిపారు.
మరిన్ని చూడండి