Police Arrested Woman Who Sale Ganza in Nanakramguda: రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలను పూర్తిగా నివారించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ మేరకు పోలీసులు సైతం ఎక్కడికక్కడ సోదాలు నిర్వహించి గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే, తాజాగా నానక్ రాంగూడాలో (Nanakramguda) గంజాయి విక్రయాలు కలకలం రేపాయి. ఓ మహిళ గంజాయిని బహిరంగంగానే విక్రయిస్తుండడాన్ని గుర్తించిన పోలీసులు షాకయ్యారు. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి పక్కా ప్రణాళికతో ఆమెతో సహా కొనుగోలు చేస్తున్న అందరినీ కటాకటాల్లోకి నెట్టారు. అయితే, ఆమె ఏళ్ల తరబడి ఈ దందా సాగిస్తుండడం గమనార్హం. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
రాష్ట్రంలో మత్తు పదార్థాల కట్టడికి ఏర్పాటైన తెలంగాణ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (టీన్యాబ్) డైరెక్టర్ సందీప్ శాండిల్య డ్రగ్స్ కు సంబంధించిన సమాచారంపై తరచూ రాష్ట్రంలో అందరి పోలీసులనూ అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సిద్ధిపేట కమిషనరేట్ పోలీసులకు మత్తు పదార్థాల విక్రయంపై కొంత సమాచారం అందింది. ఇటీవలే ములుగు ప్రాంతంలో చిక్కిన ఇద్దరు గంజాయి విక్రేతలను విచారించగా తాము నానక్ రాంగూడలో తెచ్చామని పోలీసులకు తెలిపారు. దీంతో నిజానిజాలు తెలుసుకునేందుకు సిద్ధిపేట కమిషనర్ అనూరాధ ఓ బృందాన్ని అక్కడికి పంపారు. రహస్యంగా అక్కడకు వెళ్లిన పోలీసులు.. గంజాయి కొనేందుకు ఓ పెద్ద క్యూనే ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. బహిరంగంగానే గంజాయి విక్రయాలు చేపట్టగా.. పదిహేను మంది క్యూలో నిలబడ్డారు.
ఆమెనే కీలక నిందితురాలు
నీతూబాయి అనే మహిళ ఎలాంటి జంకూ గొంకూ లేకుండా గంజాయిని బహిరంగంగానే విక్రయిస్తుండడం చూసిన పోలీసులు షాకయ్యారు. గంజాయి కొనేందుకు ఉన్న క్యూలోనే పోలీసులు నిలబడి రూ.5 వేల గంజాయి కావాలని అడిగారు. ఆమె ఏమాత్రం భయం లేకుండా సరుకు ఇవ్వడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. ప్రత్యేక బృందం అందించిన సమాచారాన్ని కమిషనర్ అనురాధ.. సందీప్ శాండిల్యకు వివరించారు.
పక్కా ప్లాన్ తో..
గంజాయి విక్రేత నీతుబాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు సందీప్ శాండిల్య ఆధ్వర్యంలో పోలీసుల బృందం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి సహకారంతో బృందాన్ని ఏర్పాటు చేసి నీతూబాయి ఇంటికి పంపారు. ఆమె ఇంటి లోపలికి వెళ్లేందుకు నాలుగు అంచెల్లో గ్రిల్స్ ఉన్నాయని.. ఒకవేళ పోలీసులు గ్రిల్స్ తొలగించుకుని వెళ్తే గంజాయిని మ్యాన్ హోల్ లో పడేసి తప్పించుకునే అవకాశం ఉందని.. సిద్ధిపేట పోలీసులు చెప్పడంతో అందుకు అనుగుణంగా ప్రణాళిక రచించారు. ఈ క్రమంలో తమ వెంట ఇద్దరు స్వీపర్లను తీసుకెళ్లారు. గ్రిల్స్ తొలగించే లోపు మ్యాన్ హోల్ ను బ్లాక్ చేసి గంజాయి కొట్టుకుపోకుండా సీజ్ చేయాలనేదే ప్లాన్. ఈ క్రమంలోనే పోలీసుల బృందం అక్కడకు వెళ్లింది. అప్పటికే అక్కడ 10 మంది గంజాయి కొనుగోలు చేస్తూ కనిపించారు. దీంతో రెడ్ హ్యాండెడ్ గానే నీతుబాయితో పాటు అందరినీ అరెస్ట్ చేశారు. ఆమె ఇంట్లో భారీగా గంజాయితో పాటు రూ.16 లక్షల నగదు సీజ్ చేశారు.
జైలుకెళ్లినా మారలేదు
కాగా, నిందితురాలు నీతుబాయిపై తొలుత 2017లో శేరిలింగంపల్లి ఎక్సైజ్ విభాగం కేసు నమోదు చేసింది. అనంతరం 2021 సెప్టెంబర్ వరకూ ఆమెపై 12 కేసులు నమోదు కావడంతో పీడీ చట్టం ప్రయోగించారు. ఏడాది అనంతరం జైలు నుంచి తిరిగి వచ్చిన 2 నెలలకే మళ్లీ గంజాయి విక్రయిస్తూ పోలీసులకు చిక్కింది. అలా గత అక్టోబర్ వరకూ మరో 6 కేసులు.. మొత్తం 18 కేసులు నిందితురాలిపై నమోదయ్యాయి. తాజాగా మరోసారి నీతూబాయిపై పీడీ చట్టం ప్రయోగించేందుకు పోలీసులు నివేదిక రూపొందించారు.
గంజాయి చాక్లెట్ల విక్రయం
మరోవైపు, సైబరాబాద్ పరిధిలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. జీడిమెట్లలో బీహార్ కు చెందిన శిబుకుమార్ అనే యువకుడు కిరాణా దుకాణంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు గుర్తించిన పోలీసులు దాడి చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద రూ.11,500 విలువైన 150 గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.
అటు, రామచంద్రాపురం బాలాజీనగర్ లోని బీహార్ కు చెందిన సీతారామ్ సింగ్ అనే 60 ఏళ్ల వృద్ధుడు గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించి మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద నుంచి రూ.30 వేల విలువైన గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నిజాంపేట్ లోని పాన్ షాపులపై దాడి చేసి నిషేధిత సిగరెట్స్ పట్టుకున్నారు. నిందితులు చంద్రశేఖర్, బాలరాజ్ లను అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని చూడండి