IND vs AUS Match highlights: టీమిండియా(Team India) ప్రతీకారం అదిరిపోయింది. వన్డే ప్రపంచకప్(ODI World Cip)లో ఎదురైన ఓటమికి రోహిత్ సేన చాలా గట్టిగా బదులు తీర్చుకుంది. ఆస్ట్రేలియా(AUS) సెమీస్ అవకాశాలు గల్లంతు చేస్తూ టీమిండియా సగర్వంగా సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) బ్యాట్‌తో విధ్వంసం సృష్టించగా… బౌలర్లు సమష్టిగా రాణించి ఆస్ట్రేలియాకు చెక్ పెట్టారు. ఓ దశలో భారత విజయానికి అడ్డుగోడలా నిలిచిన ట్రావిస్ హెడ్ మరోసారి భయపెట్టినా… బుమ్రా మరోసారి దెబ్బకొట్టి భారత జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రోహిత్ శర్మ 92 పరుగులతో కంగారు బౌలర్లను ఊచకోత కోయడంతో 205 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా పోరాడినా విజయం మాత్రం దక్కలేదు. కంగారులు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులకే పరిమితమైంది. దీంతో 24 పరుగులతో ఘన విజయం సాధించి సెమీస్ చేరింది. సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్‌తో టీమిండియా తలపడనుంది.
హెడ్ పోరాడినా…
206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులకు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ ఆరంభంలోనే కంగారులను దెబ్బ కొట్టాడు. ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ను అర్ష్‌దీప్ అవుట్ చేశాడు. దీంతో ఆరు పరుగుల వద్ద కంగారులు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ట్రావిస్ హెడ్‌తో జత కలిసిన ఆసిస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ భారత్‌ను భయపెట్టాడు. వీరిద్దరూ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓవర్‌కు పది పరుగులపైనా జోడిస్తూ ధాటిగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్… వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ను గుర్తు చేస్తూ చెలరేగాడు. వీరద్దరూ ధాటిగా ఆడుతుండడంతో ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని ఛేదించేలానే కనిపించింది. వీరిద్దరూ తొమ్మిది ఓవర్లకు 87 పరుగులు జోడించి…. కంగారుల విజయానికి బాటలు వేశారు.
క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్
ఇలాగే ఆడితే కంగారుల విజయం తథ్యమని అందరూ భావిస్తున్న వేళ… అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఓ అద్భుతం జరిగింది. కుల్‌దీప్ వేసిన ఓ షార్ట్ పిచ్ బంతిని మిచెల్ మార్ష్ చాలా బలంగా బాదాడు. ఆ బంతి సిక్స్ వెళ్లిపోయిందని అందరూ భావించారు. కానీ అక్షర్ పటేల్ బౌండరీ లైన్ వద్ద పైకి ఎగురుతూ ఒంటి చేత్తో క్యాచ్‌ను అందుకున్నాడు. ఆ క్యాచ్ చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ఈ క్యాచ్ మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పింది.
India advance to the semi-finals of the #T20WorldCup 2024 🔥🇮🇳
Rohit Sharma’s marvellous 92 combined with a superb bowling effort hand Australia a defeat in Saint Lucia 👏#AUSvIND | 📝: https://t.co/lCeqHIMg1Y pic.twitter.com/HklyIAXzvL
— ICC (@ICC) June 24, 2024
పట్టుబిగించిన బౌలర్లు
మిచెల్ మార్ష్ అవుటైన తర్వాత కంగారులపై ఒత్తిడి పెంచారు. ఆ తర్వాత హెడ్‌తో జతకలిసిన మాక్స్‌వెల్ కాసేపు ధాటిగానే బ్యాటింగ్ చేశాడు. అయితే మరోసారి కుల్‌దీప్ మాయ చేశాడు. అద్భుతమైన బంతితో మాక్స్‌వెల్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో 20 పరుగులు చేసి మాక్స్‌వెల్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లపై ఒత్తిడి పెంచిన బౌలర్లు పరుగులు రాకుండా కట్టడి చేశారు. అయినా ఓ వైపు హెడ్ ఉండడంతో టీమిండియాలో ఎక్కడో ఆందోళన కనిపించింది. అయితే బుమ్రా.. ఓ స్లో బంతితో ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేయడంతో మ్యాచ్ పూర్తిగా టీమిండియా చేతుల్లోకి వచ్చేసింది. హెడ్ 43 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కంగారు బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 3, కుల్‌దీప్2, బుమ్రా, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. ఈ గెలుపుతో టీమిండియా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ నెల 27న ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.
మరిన్ని చూడండి