ఆసియా గేమ్స్ 2023లో భారత్-అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. కొద్దిపాటి వర్షం కురవడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో టాస్ ఆలస్యమైంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని జట్టు ఇప్పటికే ఏకపక్ష విజయాలతో ఫైనల్ చేరింది. పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చి ఫైనల్ చేరిన అఫ్గాన్ కూడా స్వర్ణ పతకంపై కన్నేసింది. కానీ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత్‌ను అఫ్గాన్ అడ్డుకోవడం అంత తేలిక కాదు. హాంగ్‌జౌలో జరిగే ఈ మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది.
భారత్ జైత్రయాత్ర సాగిందిలా
ఈ ఆసియా గేమ్స్‌లో భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్‌లో నేపాల్‌ను 23 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఆ తర్వాత సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 96 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. భారత్ తరఫున రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన చేశారు. తిలక్ వర్మ అజేయ అర్ధసెంచరీతో చెలరేగాడు. ఫైనల్స్‌లోనూ తిలక్ అద్భుతాలు చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. కెప్టెన్ రుతురాజ్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
అఫ్గాన్ ఫైనల్ చేరిందిలా…
ఆఫ్ఘనిస్థాన్ ఈ ఆసియా గేమ్స్‌లో అద్భుతమే చేసింది. క్వార్టర్ ఫైనల్‌లో ఎనిమిది పరుగుల తేడాతో శ్రీలంకకు షాక్ ఇచ్చిన అఫ్గాన్ జట్టు… సెమీస్‌లో పాకిస్థాన్‌ను 4 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 115 పరుగులు చేయగా… అఫ్గానిస్థాన్ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అఫ్గాన్ తరఫున నూర్ అలీ జద్రాన్ 39 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ గుల్బాదిన్ 26 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అఫ్గానిస్తాన్‌తో జరిగే తుదిపోరులోనూ విజయం సాధించి భారత్‌కు పసిడిని అందించాలని గైక్వాడ్ సేన పట్టుదలగా ఉంది. యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్ సహా ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసిరానుంది. అఫ్గాన్ కూడా తమకంటే బలమైన పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చి ఆత్మ విశ్వాసంతో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు కూడా షాక్ ఇవ్వాలని అఫ్గాన్ భావిస్తోంది. అయితే ఎలాంటి అలసత్వానికి చోటు ఇవ్వకుండా టీమిండియా స్వర్ణ కాంతులు విరజిమ్మాలని అభిమానులు కోరుకుంటున్నారు.
భారత జట్టు:
యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ త్రిపాఠి, అవేష్ ఖాన్, అవేష్ ఖాన్, కుమార్, ప్రభాసిమ్రన్ సింగ్, ఆకాష్ దీప్
అఫ్గాన్ జట్టు:
సెడిఖుల్లా అటల్, మహ్మద్ షాజాద్ (వికెట్ కీపర్), నూర్ అలీ జద్రాన్, షాహిదుల్లా కమల్, అఫ్సర్ జజాయ్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్ (కెప్టెన్), షరాఫుద్దీన్ అష్రాఫ్, ఖైస్ అహ్మద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, జహీర్ ఖాన్, జహీర్ ఖాన్, జహీర్ ఖాన్, జుబైద్ అక్బరీ, వఫివుల్లా తార్ఖిల్