India vs England 4th Test: రాంచీ(Ranchi) వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా(Team India) బౌలర్లు చెలరేగారు. తొలి సెషన్‌లోనే అయిదు వికెట్లు నేలకూల్చి ఇంగ్లాండ్(England)ను కష్టాల్లోకి నెట్టారు. అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లతో నిప్పులు చెరిగాడు. ఆ తర్వాత అశ్విన్, జడేజా చెరో వికెట్ తీయడంతో ఇంగ్లాండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. లంచ్‌కు ముందు ఓవర్లో కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను జడేజా ఎల్బీగా వెనక్కి పంపాడు. దాంతో 112 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఐదో వికెట్ పడింది. మాజీ కెప్టెన్ జో రూట్ 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్.. అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బెయిర్ స్టోను అవుట్ చేసి అశ్విన్ ఈ ఘనత సాధించాడు. 23 మ్యాచుల్లోనే ఈ స్టార్ స్పిన్నర్ వంద వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కూడా అశ్విన్ నిలిచాడు. అశ్విన్ కంటే ముందు జేమ్స్ అండర్సన్ భారత జట్టుపై 139 వికెట్లు తీసి టాప్‌లో ఉన్నాడు.
మరో రికార్డు కూడా…
టెస్టుల్లో ఒక దేశంపై వేయికుపైగా పరుగులు 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గానూ అశ్విన్ మరో రికార్డ్ సాధించాడు. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత అందుకున్న ఏడో బౌలర్‌గా నిలిచాడు. అతడి కంటే ముందు జార్జ్ గిఫెన్, మోనీ నోబెల్, విల్‌ఫ్రెడ్ రోడ్స్, గార్‌ఫీల్డ్ సోబెర్స్, ఇయాన్ బోథమ్, స్టువర్ట్ బ్రాడ్ ఈ ఫీట్ సాధించారు. స్వదేశంలో జరిగిన టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా అశ్విన్ కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 350 వికెట్లతో ముందున్నాడు. ప్రస్తుతం 349 వికెట్లతో ఉన్న అశ్విన్.. మరో రెండు పడగొడితే కుంబ్లేను దాటేస్తాడు. ఇక టెస్టుల్లో కుంబ్లే 35 సార్లు ‘ఐదు వికెట్ల’ ఘనత అందుకోగా.. అశ్విన్ ఇప్పటి వరకు 34 సార్లు ఆ ఫీట్‌ను సాధించాడు. తాజాగా జరుగుతున్న నాలుగో టెస్టులో చెలరేగితే.. ఈ రికార్డు కూడా అశ్విన్ ఖాతాలో చేరనుంది.
ఆరంగేట్రంలోనే ఇరగదీస్తున్న ఆకాశ్
రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో అరంగేట్ర బౌలర్ ఆకాశ్‌దీప్ అదరగొడుతున్నాడు. అద్భుతమైన బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తొలుత క్రాలేను అద్భుతమైన బంతితో ఆకాశ్‌దీప్ బౌల్డ్ చేసినా అది నో బాల్ కావడంతో క్రాలే బతికిపోయాడు. అనంతరం ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన ఆకాశ్ దీప్… ఆ తర్వాతి ఓవర్‌లోనే మరో వికెట్ తీసి బ్రిటీష్ జట్టను కోలుకోలేని దెబ్బ తీశాడు. పదో ఓవర్లో డకెట్‌ను అవుట్ చేసిన ఆకాశ్… ఒక బంతి విరామం తర్వాత ఒలిపోప్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో బ్రిటీష్ జట్టు ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే క్రాలేను బౌల్డ్ చేసిన ఆకాశ్ ఇంగ్లాండ్ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 57 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.