IND vs ENG 5th Test : భారత్(Bharat)తో జరుగుతున్న అయిదో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్(England) సాధికారికంగా బ్యాటింగ్ చేస్తోంది. తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి సరిగ్గా 100 పరుగులు చేసింది. ఆరంభంలో బజ్ బాల్‌ను పక్కన పెట్టిన ఇంగ్లాండ్.. ఆచితూచి బ్యాటింగ్ చేసింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూకుడు తగ్గించారు. సిరాజ్, బుమ్రా అద్భుతమైన బంతులతో పరుగులను కట్టడి చేస్తున్నారు.
ఇంగ్లాండ్ ఓపెనర్లు తొలి 5 ఓవర్లకు 23 పరుగులు చేశారు. పది ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నా ఆచితూచి పరుగులు రాబడుతున్నారు. 12వ ఓవర్లో సిరాజ్ వేసిన బంతి క్రాలే ప్యాడ్స్‌ను తాకగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. భారత్ రివ్యూ కోరినా అనుకూల ఫలితం రాలేదు. 15 ఓవర్లలో ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న బెన్ డకెట్ 18వ ఓవర్లో కుల్‌దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గిల్ అద్భుతమైన క్యాచ్‌తో డకెట్ వెనుదిరిగాడు. 27 పరుగులు చేసిన డకెట్ ఇచ్చిన క్యాచ్‌ను శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఒడిసిపట్టాడు. తొలి రోజు ఆటలో లంచ్ బ్రేక్ ముందు చివరి ఓవర్లో భారత్‌కు రెండో వికెట్ దక్కింది. 26వ ఓవర్లో ఒలీ పోప్ 11 పరుగులు చేసి కుల్‌దీప్ వేసిన బంతికి స్టంప్ ఔట్‌గా వెనుతిరిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా క్రాలే 61 పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత్ తీసిన రెండు వికెట్లు కుల్‌దీప్ యాదవ్‌కే దక్కాయి.
అశ్విన్ ఓ క్రికెట్ మేధావి
టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఖాతాలోకి మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఇంగ్లండ్‌తో నేడు ప్రారంభమైన చివరిదైన ఐదో టెస్టులో బరిలోకి దిగిన అశ్విన్‌కి ఇది వందో టెస్టు మ్యాచ్. దీంతో వందవ టెస్టు ఆడుతున్న 14వ ఇండియన్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించుకున్నాడు. ఈ అవార్డును అశ్విన్ కి ముందు భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్ , రాహుల్ ద్రవిడ్ , వీవీఎస్ లక్ష్మణ్ , అనిల్ కుంబ్లే , కపిల్ దేవ్ , సునీల్ గవాస్కర్ , దిలీప్ వెంగ్‌సర్కార్ , సౌరవ్ గంగూలీ , విరాట్ కోహ్లీ , ఇషాంత్ శర్మ , హర్భజన్ సింగ్ , పుజారా ఉన్నారు.
ఆఖరి టెస్టులోనూ జోరు కొనసాగిస్తుందా?
ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌లో దూకుడు మీదున్న ఉన్న టీమిండియా ఆఖరి టెస్టులోనూ అదే జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ చివరిదైన ఐదో టెస్టులో విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది. ఈ టెస్టు మ్యాచ్‌లో ఓడిపోతే WTC పాయింట్ పట్టికలో..భారత్ అగ్రస్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉండడంతో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. చల్లటి వాతావరణ పరిస్థితుల కారణంగా ధర్మశాల పిచ్ మొదట సీమర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ సాగే కొద్ది స్పిన్నర్ల ప్రభావం కనిపిస్తుంది. 2017లో ఇక్కడ జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో స్పిన్నర్లు కీలకపాత్ర పోషించారు. ధర్మశాల పిచ్ వన్ సైడెడ్‌గా ఉండదని రెండు జట్లకు అనుకూలిస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.