ICC Champions Trophy | ఈసారి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ జరగబోయేది ఎక్కడో తెలుసా? లాహోర్ లో. అవునండీ వచ్చే ఏడాది జరుగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూలును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి సమర్పించింది. ఈ షెడ్యూల్ ను ఈ ట్రోఫీలో ఆడనున్న అన్ని దేశాలూ సమ్మతించాయి. తమ సపోర్టు ఉంటాయని చెప్పాయి. కానీ బీసీసీఐ మాత్రం ఇంకా దీనిపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.
ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆసక్తి లేని క్రికెట్ అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. దాయాది దేశాల పోరుకు విపరీతమైన వ్యూవర్ షిప్ ఉంటుంది. ప్రపంచకప్ ను టైటిల్ విజేతగా ముగించిన టీమ్ ఇండియా.. ఆ మెగా టోర్నీలో పాక్ తో ఆడిన మ్యాచ్ లోనూ విజయం సాధించింది. లో స్కోరింగ్ మ్యాచ్ లో భారత్ దే పైచేయిగా నిలిచింది. యూఎస్ లో జరిగిన ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కోట్ల మంది అభిమానులు టీవీలను అతుక్కుపెట్టుకుని మరీ ఆ మ్యాచ్ చూశారు. అయితే పాక్ సూపర్ 8 దాకా కూడా రాలేకపోెవడంతో ఈ రెండు జట్లూ తిరిగి తలపడే అవకాశం రాలేదు. ఇక మళ్లీ ఈ జట్లు ఎప్పుడు తలపడతాయా అని ఎదురు చూస్తోన్న క్రికెట్ అభిమానులకైతే ఇది నిజంగా గుడ్ న్యూసే.
ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ వచ్చే ఏడాది మార్చి ఒకటిన లాహోర్ వేదికగా జరగనుంది. దీనికి సంబంధించి షెడ్యూలుని పీసీబీ ఇప్పటికే ఐసీసీకి సబ్మిట్ చేసిందట. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్ వేదికగా జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను ఐసీసీకి పీసీబీ జూలై 3న సమర్పించినట్లు పీటీఐ ఓ నివేదకలో తెలిపింది.
పాకిస్తాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ
ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరిగే ఈ టోర్నీకి పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి లు వేదికలవ్వనున్నాయి. లాహోర్‌లో ఏడు మ్యాచులు, కరాచీలో మూడు, రావల్పిండిలో ఐదు మ్యాచ్‌లు ఇలా మొత్తం 15 మ్యాచులు జరగనున్నాయి. ప్రారంభ మ్యాచ్ తో కలిపి రెండు సెమీఫైనల్స్ కరాచీలో జరగనుండగా, ఫైనల్ మ్యాచ్‌కు రావల్పిండి ఆతిథ్యమివ్వనుంది.
ఐసీసీకి పీసీబీ సమర్పించిన షెడ్యూలు ప్రకారం మార్చి 1న లాహోర్ వేదికగా భారత్ – పాక్ తలపడనున్నట్లు తెలుస్తోంది. భద్రతాపరమైన కారణాల వల్ల టీమిండియా ఆడబోయే గ్రూపు స్టేజీ మ్యాచ్‌లన్నింటినీ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలోనే ఆడేట్లు షెడ్యూల్ చేశారు. ఈ షెడ్యూల్ ను ఈ ట్రోఫీలో ఆడనున్న అన్ని దేశాల క్రికెట్ బోర్డులూ సమ్మతించాయి. తమ సపోర్టు ఉంటాయని కూడా చెప్పాయి. కానీ బీసీసీఐ మాత్రం ఇంకా దీనిపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఈ టోర్నీకి భారత జట్టును పంపే విషయంలోనూ ఇంకా ఏమీ నిర్ణయించలేదు.
దాయాది దేశాల మధ్య చాలా ఏళ్లుగా సరిహద్దు వివాదాలు రగులుతున్నాయి. అలాగే దాడులు ప్రతిదాడులతో ఇండో పాక్ సరిహద్దు రావణ కాష్టంలా ఏళ్లుగా రగులుతూనే ఉంది. పాక్ ఉగ్రవాద కార్యకలాపాలు సరిహద్దుకే పరిమితం కాకుండా దేశం నలుమూలలా అడపా దడపా వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్, పాక్ జట్లు కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ వంటి టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి.
పాక్ జట్టు భారత్ లో అప్పుడప్పుడూ పర్యటిస్తున్నప్పటికీ.. భారత జట్టు దాయాది దేశానికి దాదాపు వెళ్లట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ పెట్టిన డ్రాప్ట్ షెడ్యూల్ కు బీసీసీఐ సైతం అంగీకారం తెలపాలంటే భారత ప్రభుత్వంతో చర్చలు జరిపిన తరువాతే అది సాధ్యమని తెలుస్తోంది. క్వాలిఫై అయితే భారత్ అడే సెమీ ఫైనల్ సహా అన్ని మ్యాచులూ లాహోర్ లోనే జరిగేట్లు పాక్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ షెడ్యూలును రూపొందించింది. అయితే దీనికి సంబంధించిన టెంటెటివ్ షెడ్యూల్ ని ఐసీసీకి పీసీబీ ఛైర్మన్ మోసిన్ నక్వీ ప్రపంచకప్ ఫైనల్ రోజే సబ్మిట్ చేశారట. ఐసీసీ ఆహ్వానంపై బార్బడోస్ వెళ్లి ఫైనల్ చూసిన ఆయన అప్పుటే ఈ షెడ్యూల్ పై సమాచారం ఇచ్చారని సైతం తెలుస్తోంది.
మరిన్ని చూడండి