T20 World Cup 2024 Final Winner Team India: అసలు ఏమన్నా మ్యాచ్ ఇది. ప్రపంచకప్ ఫైనల్(T20 World Cup 2024 Final )ఎలా జరగాలో అలా జరిగిన మ్యాచ్ అది. ఇక టీమిండియా(India) ఓటమి తప్పదని… అభిమానులంతా ఓ నిర్ణయానికి వచ్చేసిన వేళ… చాలామంది టీవీలు ఆఫ్ చేసిన వేళ… రోహిత్ సేన చోకర్లుగా మిగిలి పోవాల్సిందేనా అని సగటు అభిమాని ఆవేదనగా చూస్తున్న వేళ… నిర్వేదం, నిస్తేజం, ఆవేశం, బాధ ఇలా అన్ని చుట్టుముట్టిన వేళ… రోహిత్ సేన అద్భుతం చేసింది. కాదు కాదు మహాద్భుతం చేసింది. రోహిత్ సేన హృదయాలు తప్ప మ్యాచ్ గెలవదని నైరాశ్యంలో కూరుకుపోయిన వేళ భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఓటమి అంచుల నుంచి అద్భుతంగా పోరాటం చేసిన రోహిత్ శర్మ సేన దక్షిణాఫ్రికాకు గుండె కోతను మిగులుస్తూ టీ 20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలవడమే ఒక అద్భుతం. ఎందుకంటే ఒక దశలో కేవలం 24 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేయాల్సి ఉన్న స్థితిలో సౌతాఫ్రికా గెలుపు ఖాయమనే అంతా అనుకున్నారు. కానీ అర్ష్‌దీప్ మాయ చేయగా… బుమ్రా అద్భుతం సృష్టించగా… హార్దిక్ పాండ్యా మహాద్భుతంతో చెలరేగగా సఫారీలకు కన్నీళ్లే మిగిలాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కోహ్లీ అర్ధ శతకంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా… సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులకే పరిమితమైంది.
The wait of 17 years comes to an end 🇮🇳
India win their second #T20WorldCup trophy 🏆 pic.twitter.com/wz36sxYAhw
— ICC (@ICC) June 29, 2024
కోహ్లీ ఒక్కడే
ఈ మెగా టోర్నీ ఫైనల్లో విరాట్ కోహ్లీ అర్ధ శతకంతో చెలరేగడంతో టీమిండియా సవాల్ విసిరే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత సారధి రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి ఓవర్లోనే కోహ్లీ మూడు ఫోర్లు కొట్టి ప్రత్యర్థికి హెచ్చరికలు పంపాడు. కానీ సఫారీ కెప్టెన్ మార్క్రమ్ వ్యూహాత్మకంగా రెండో ఓవర్లోనే కేశవ్ మహరాజ్‌ను బౌలింగ్‌కు తెచ్చాడు. ఒకే ఓవర్లో రోహిత్-పంత్‌ను అవుట్ చేసి మహరాజ్ చావు దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత సూర్య భాయ్ కూడా అలా వచ్చి ఇలా పెవిలియన్ చేరాడు. ఈ క్లిష్ట సమయంలో కోహ్లీ-అక్షర్ పటేల్ ఆపద్భాందవుల్లా మారి భారత్‌కు మంచి స్కోరు అందించారు. కోహ్లీ 59 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు భారీ సిక్సులు బాది 76 పరుగులు చెలరేగడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ మెరుపు బ్యాటింగ్‌తో 31 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సులతో 47 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. దూబే 16 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సుతో 27 పరుగులు చేయడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
పోరాడిన సఫారీలు
177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలకు తొలి ఓవర్లోనే బుమ్రా షాక్ ఇచ్చాడు. రెండో ఓవర్లోనే హెండ్రింక్స్‌ను అవుట్ చేసి చేశాడు. అ తర్వాతి ఓవర్లోనే మార్క్రమ్ను అర్ష్‌దీప్ అవుట్ చేశాడు. అయితే డికాక్, స్టబ్స్ సఫారీలను ఆదుకున్నారు. డికాక్ ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. 31 బంతుల్లో 39 పరుగులు చేసి డికాక్ అవుట్ అయ్యాడు. కానీ హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసంతో ప్రొటీస్ సునాయసంగా గెలిచేలా కనిపించింది. టీమిండియా స్పిన్నర్లను ఊచకోత కోసిన క్లాసెన్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. ఈ దశలో సఫారీల విజయం తేలికే అనిపించింది. కానీ పాండ్యా, బుమ్రా, అర్ష్‌దీప్ చివరి మూడు ఓవర్లలో మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేశారు. చివరి ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్‌తో… మ్యాచ్‌తో పాటు కప్పు కూడా టీమిండియా వశమైంది.
మరిన్ని చూడండి