Yashaswi Jaiswal Bagged The Icc Player Of The Month Award: టీమిండియా(Team India) యువ సంచలనం, ఇంగ్లాండ్(England)తో జరిగిన అయిదు టెస్ట్‌ల సిరీస్‌లో పరుగుల వరద పారించిన యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) మరో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 712 పరుగులు చేసి బ్రిటీష్ జట్టుతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక రన్స్ చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సునీల్ గావస్కర్ తర్వాత ఒక టెస్టు సిరీస్‌లో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో ఇండియన్ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ సంచలన ఆట తీరుతో యశస్వి ఫిబ్రవరి నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు విజేతగా నిలిచాడు. ఫిబ్రవరి నెలకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ సంబంధించిన నామినీస్ జాబితాలో యశస్వి జైస్వాల్‌తో పాటు కివీస్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక లు చోటు సంపాదించారు. ఫిబ్రవరి నెలలో వీరి ప్రదర్శనలు పరిగణలోకి తీసుకుని వీరిని ఐసీసీ నామినేట్ చేసింది. అయితే వీరందరినీ దాటి యశస్వీ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును దక్కించుకున్నాడు. ఐసీసీ అవార్డును సాధించినందుకు సంతోషంగా ఉందని.. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకుంటానని యశస్వీ తెలిపాడు.
తక్కువ ఇన్నింగ్సుల్లోనే వెయ్యి పరుగులు
టెస్టుల్లో తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగులు బాదిన రెండో భారత క్రికెటర్‌గా జైస్వాల్ కొత్త చరిత్ర లిఖించాడు. యశస్వీ కేవలం 16 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకోగా…. వినోద్ కాంబ్లీ 14 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసి తొలి స్థానంలో ఉన్నాడు. 18 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు కొట్టిన ఛతేశ్వర్ పూజారా మూడో స్థానానికి పడిపోయాడు. యశస్వీ తక్కువ మ్యాచుల్లోనే వెయ్యి రన్స్ బాదిన ఐదో ఆటగాడిగా కూడా మరో రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు బ్రాడ్‌మన్ 7 మ్యాచుల్లోనే వెయ్యి పరుగులు పూర్తి చేసుకోగా… యశస్వీ 9 వ మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. పిన్న వయసులోనే టెస్టుల్లో వెయ్యి రన్స్ కొట్టిన యశస్వీ.. మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్‌సర్కార్ రికార్డు బ్రేక్ చేశాడు. సచిన్ 19 ఏళ్ల 217 రోజుల్లో వెయ్యి పరుగులు చేయగా యశస్వీ 22 ఏళ్ల 70 రోజుల్లో వెయ్యి రన్స్ చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు.
టెస్ట్ ర్యాంకింగ్స్‌లో..
ఈ సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్న యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal)… ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్(ICC Test Rankings )లో సత్తా చాటాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో యశస్వి టాప్-10లోకి దూసుకొచ్చాడు. రెండు స్థానాలు మెరుగుపరచుకుని పదో స్థానంలో నిలిచాడు. అటు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం రెండు స్థానాలు మెరుగుపరచుకుని 11వ స్థానానికి చేరుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనప్పటికీ విరాట్ కోహ్లి టాప్-10లోనే కొనసాగుతున్నాడు. 744 రేటింగ్ పాయింట్లతో ఎనిమిదిలో స్థానంలో ఉన్నాడు. ఎప్పటిలాగానే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత వరుసగా జో రూట్, స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్, బాబర్ ఆజామ్‌లు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. కేన్ విలియమ్సన్ 870 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా… 799 రేటింగ్ పాయింట్లతో జో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. స్టీవ్ స్మిత్ 789 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. డారిల్ మిచెల్ నాలుగు, బాబర్ ఆజాం అయిదు… ఉస్మాన్ ఖవాజా ఆరు.. కరుణరత్నె ఏడు… విరాట్ కోహ్లి ఎనిమిది… హ్యారీ బ్రూక్ తొమ్మిది… యశస్వి జైస్వాల్ పది… రోహిత్ శర్మ పదకొండో స్థానంలో ఉన్నారు.
మరిన్ని చూడండి