Telugu poet Narayana Reddys statue: హైదరాబాద్: తెలుగు భాషకు ఎంతో తీయదనాన్ని అందించిన మహానుభావుడు మహాకవి డాక్టర్. సి నారాయణ రెడ్డి అని సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. సినారె రాసిన కావ్యాలు, సినిమా పాటలు ఎన్నటికీ మరిచిపోలేము అన్నారు. తెలుగువారికి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టిన సినారే విగ్రహాన్ని హైదరాబాద్ లో ప్రతిష్ఠిస్తామని తెలిపారు.
రవీంద్రభారతిలో సి. సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ – ప్రముఖ సాహిత్య సాంస్కృతిక సంస్థ రసమయి సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. సుశీల నారాయణరెడ్డి ట్రస్టు పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి జానకీబాలకు అందజేసి, సత్కరించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు విశ్వవిద్యాలయం, అలాగే తెలంగాణ సారస్వత పరిషత్తు వంటి వేదికల ద్వారా ప్రోత్సాహం కల్పించే కార్యక్రమాలకు ప్రభుత్వం సహకారం ఎల్లప్పుడు ఉంటుంది అన్నారు.
భాష, సాహిత్యం, కళా సాంస్కృతిక రంగాల పెద్దలతో పరిస్థితులను సమీక్షించి రానున్న కాలంలో మంచి మార్పులు తీసుకురావాలని భావిస్తున్నామని వెల్లడించారు. ఈ డిజిటల్ యుగంలో టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోయి, మెటరీలిస్టిక్ గా తయారయ్యారని అన్నారు. కళలు, సాయిత్యం, ఆటలు, పాటలు పట్ల ఆసక్తి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తున్నదని మంత్రి జూపల్లి అన్నారు. ఈ కార్యక్రమంలో శాంతా బయోటెక్నిక్స్ అధినేత డా.కై.ఐ. వరప్రసాద రెడ్డి, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు- ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రముఖ రచయిత్రి ఇంద్రగంటి జానకీబాల, సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి డా. చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు