KA Paul meets revanth Reddy: తెలంగాణకు పెట్టుబడులు తెచ్చే ఉద్దేశంతో హైదరాబాద్ లో ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సును నిర్వహిస్తున్నట్లుగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా వచ్చే అక్టోబరు 2న ఈ ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేఏ పాల్ తెలంగాణ సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇద్దరూ ఈ ప్రపంచ సదస్సు గురించి మాట్లాడుకున్నారు.
అక్టోబరు 2న హైదరాబాద్ లో ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని కేఏ పాల్ ఓ వీడియో ద్వారా తెలిపారు. సదస్సుకు హాజరు కావాలని ఇన్వెస్టర్లను కోరుతూ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉమ్మడిగా వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో హైదరాబాద్ లో కేఏ పాల్ నిర్వహించే ప్రపంచశాంతి, ఆర్థిక సదస్సుకు పెట్టుబడు దారులు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో నిర్వహించే ఈ సమావేశానికి ఒప్పుకున్నారని కేఏ పాల్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు భారీ పెట్టుబడులు తెచ్చేలా సదస్సు నిర్వహణ చేస్తానని హామీ ఇచ్చారు.