Khammam Loksabha Seat: ఎన్నికల ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam News) రాజకీయాలు హట్ హట్ గా సాగిన పరిస్థితి తెలుసు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 స్థానాలు, సీపీఐ ఒక స్థాం, బీఆర్ఎస్ ఒక స్థానం లో గెలిచాయి. ఎన్నికల తర్వాత కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. ఏ జిల్లాకు లేనట్లుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కాయి. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, వ్యవయసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పదవులు పొందారు. అంతా చక్కగా సాగుతున్న తరుణంలో ముగ్గురు మంత్రుల మధ్య ఎంపీ టికెట్ కోల్డ్ వార్ కు దారి తీసింది.
మా కుటుంబానికే టికెట్ అంటోన్న ముగ్గురు అమాత్యులు
పార్లమెంట్ ఎన్నికల్లో గన్ షాట్ గా రాష్ట్రంలో గెలిచే సీటు ఏదంటే ఠక్కున చెప్పేది ఖమ్మం పార్లమెంట్ సీటునే. పార్లమెంట్ పరిధిలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏడింటిలో ఆరు కాంగ్రెస్ గెలుచుకోగా, కొత్తగూడెం స్థానం నుండి మిత్ర పక్షమైన సీపీఐ గెల్చుకుంది. దీంతో ఖమ్మం పార్లమెంట్ సీటు ఆ పార్టీలో హట్ కేక్ గా మారింది. ఖమ్మం పార్లమెంట్ సీటు తమ కుటుంబ సభ్యులకే ఇవ్వాలని ముగ్గురు మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన, కాంగ్రెస్ అధిష్టానంపైన ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
భార్య కోసం పట్టుబడుతున్న భట్టి
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన భార్య నందినికి ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ముఖ్యమంత్రి పదవి దక్కాల్సింది పార్టీ హైకమాండ్ నిర్ణయానికి తలొగ్గి వదులుకోవడం జరిగిందని, పార్టీ కష్టకాలంలోను మధిర నుండి గెలిచి శాసన సభలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు నిలిచారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం పాదయాత్ర నిర్వహించారని ఇలా పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న భట్టి విక్రమార్క సతీమణికే పార్లమెంట్ టికెట్ ఇవ్వాలన్నది ఆయన వర్గీయుల వాదన. ఇప్పటికే భట్టి సతీమణి నందిని పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రచారానికి దిగడం విశేషం. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో భట్టికున్న సీనియారిటీ, పరిచయాలు, ఎన్నికల్లో ఆయన సతీమణి ప్రచారంలో భాగంగా ప్రజలతో మమేకం కావడం వంటి అంశాలు కలిసి వస్తాయని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
సోదరుడి కోసం పొంగులేటి
ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఎదిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి గెలవడమే కాకుండా మంత్రి పదవి పొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి పదవి ఇచ్చారంటే ఆయనకున్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. గతంలో ఖమ్మం ఏంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సారి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఆ సీటు ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. పొలిటకల్ ఫేస్ గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నా వెనక నుండి అన్ని విషయాలు చక్కబెట్టేది ప్రసాద్ రెడ్డి అన్నది ఖమ్మంలో అందరికీ తెలిసిందే. వైకాపాలోను, బీర్ఎస్ పార్టీలో ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా పార్టీలో నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయ కర్తగా ఆయన పని చేస్తుంటారు. శాసన సభ ఎన్నికల్లోను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలుపు కోసం అవిశ్రాంతంగా పని చేశారు. ఇలా పార్టీ నేతలందరికీ ప్రసాద్ రెడ్డి దగ్గరగా ఉంటారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం, ఆయనకున్న పరిచయాలు, ప్రసాద్ రెడ్డి కార్యకర్తలతో కలిసిపోవడం వంటి అంశాలు.. ప్రసాద్ రెడ్డి గెలుపుకు ఉపయోగపడుతుందని పొంగులేటి వర్గీయులు చెబుతున్నారు.
తనయుడి కోసం తుమ్మల
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సీనియర్ తుమ్మల నాగేశ్వరరావు. అటు టీడీపీలోను, బీఆర్ఎస్ లోను, ఇప్పుడు కాంగ్రెస్ లోను కీలక నేతగా ఖమ్మం రాజకీయాలను ఒంటి చేత్తో తిప్పుతన్న నేత తుమ్మల. కారు దిగి హస్తం చేయి పట్టుకోగానే ఆయన ఖమ్మంలో గెలిచి మంత్రి పదవిని దక్కించుకున్నారంటే తుమ్మల పొలిటికల్ స్టైల్ ఏంటో అర్థమవుతూనే ఉంది. గత కొన్నేళ్లుగా తుమ్మల తన తనయుడు యుగంధర్ చే రాజకీయ అరంగ్రేటం చేయించాలన్న ఆసక్తితో ఉన్నారు. అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ఖమ్మం పార్లమెంట్ నుండి గెలిస్తే తన తనయుడి రాజకీయ భవిష్యత్తు భేష్ గా సాగుతుందన్నది ఆయన ఆలోచనగా తుమ్మల వర్గీయులు చెబుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ హైకమాండ్ పైన ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. సత్తుపల్లి, పాలేరు, ఖమ్మం ఇలా తుమ్మల ఎక్కడ నుండి పోటీ చేసినా… ఆయన కుమారుడు యుగంధర్ పార్టీని సమన్వయపరిచే వారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారు. యుగంధర్ రాజకీయాలకు రావడానికి ఇదే మంచి తరుణమని, తుమ్మల వర్గీయులు చెబుతున్నారు. టికెట్ ఇస్తే గెలుపు పక్కా అని ధీమావ్యక్తం చేస్తున్నారు. ఇలా ముగ్గురు అమాత్యులు తమ కుటుంబానికే టికెట్ దక్కుతుంది అంటూ అటు మీడియాలోను, సోషల్ మీడియాలోను కోల్డ్ వార్ ప్రారంభించారు
ముగ్గురి మధ్యకు సోనియమ్మ
ముగ్గురు అమాత్యులు పోటీ పడుతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం పార్లమెంట్ సీటు నుండి సోనియా గాంధీ పోటీ చేయాలన్న తీర్మానం తెరపైకి తెచ్చినట్లు సమాచారం. అయితే ఇందుకు పార్టీ హైకమాండ్ ఇప్పటి వరకు నోరు మెదపలేదని, సోనియా గాంధీ ఇక్కడి నుండి పోటీ చేసే అవకాశం లేదన్న సంకేతాలు వస్తున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఖమ్మం లోను విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ సంకేతాలకు అనుగుణంగానే ముగ్గురు మంత్రులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మధ్యలో మాజీ ఎంపీ రేణుకా చౌదరి సైతం సీన్ లోకి ఎంటరయింది. ఖమ్మం సీటు నాదే అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఏది ఏమైనా కామ్ గా ఉన్న ఖమ్మం కాంగ్రెస్ లో ఎంపీ సీటు వ్యవహారం రచ్చగా మారుతుందేమో అన్న భయాలను కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురి మంత్రుల మధ్య టికెట్ పంచాయతీని సీఎం రేవంత్, ఢిల్లీ హైకమాండ్ ఎలా తెగ్గొడతారో వేచి చూడల్సిందే.