ByGanesh
Mon 19th Feb 2024 12:23 PM
నమ్మినబంటు నానీని కాదని.. హన్మంతుకా..?
గుడివాడ వేదికగా రాజకీయం ఆసక్తికరంగా మారింది. గుడివాడ అంటే కొడాలి నాని కంచుకోట అని భావన సర్వత్రా ఉంది. తొలుత టీడీపీకి కంచుకోటగా ఉన్న గుడివాడ.. కొడాలి నాని వైసీపీలో చేరాక ఆయన కంచుకోటగా మారిపోయింది. దశాబ్ద కాలంగా గుడివాడలో ఆయనే గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి కూడా వైసీపీ టికెట్ కొడాలి నానికేనని ఆయన అనుచరులంతా ధీమాతో ఉన్నారు. ఇక్కడి నుంచి నానికి తప్ప మరొకరికి అవకాశం ఉండదని ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఒకటి గుడివాడలో తెగ వైరల్ అవుతోంది. పట్టణంలో కొత్త పేరుతో ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున వెలిశాయి. ఇది చూసిన కొడాలని నాని అనుచరులకు మైండ్ బ్లాక్ అయ్యింది.
సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..
గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. హనుమంతరావు గత కొంత కాలంగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. ఆయనకు సీఎంవో నుంచి పిలుపు వచ్చిందని.. ఆయనకు సీటు ఫిక్స్ అంటూ ఒక వర్గం వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. పైగా హనుమంతరావుకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఆయన వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి ఆ కుటుంబానికి వీర విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. అదే ఆయనకు బాగా కలిసొస్తోందట. ఇక గుడివాడ వ్యాప్తంగా వెలిసిన బ్యానర్లపై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
కేవలం ప్రచారమేనా?
నిజంగానే అధిష్టానం హనుమంతరావుకే టికెట్ ఇవ్వాలనుకుంటోందా? లేదంటే అది కేవలం ప్రచారమేనా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఇది నిజమే అయితే కొడాలి నాని పరిస్థితేంటన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ హనుమంతరావు వైపు అధిష్టానం మొగ్గు చూపితే కొడాలి నాని పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి కొడాలి నాని.. పార్టీని నమ్ముకుని ఇష్టానుసారంగా ప్రతిపక్షాలపై రాళ్లు రువ్వారు. బూతులతో రెచ్చిపోయారు. ప్రస్తుతం జగన్ నియోజకవర్గ ఇన్‌చార్జులను మార్చే పనిలో ఉన్నారు. దీనిలో భాగంగా చాలా మంది సిట్టింగ్‌లను నిర్మొహమాటంగా మార్చేశారు. ఈ క్రమంలోనే కొడాలి నానిని కూడా అవసరమైతే మార్చేస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మరి ఏం జరుగుతుందనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
Kodali Nani out.. Hanumantrao in?:
Kodali Nani vs Hanumantha Rao