MLC Kavitha was arrested in Delhi liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆమెకు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి దాదాపు నాలుగైదు గంటలపాటు ఈడీ, ఐటీ అధికారులు కొన్ని బృందాలుగా ఏర్పడి ఎమ్మెల్సీ కవిత నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో సాయంత్రం కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రాత్రి 8.45 ఫ్లైట్ లో ఢిల్లీకి తీసుకెళ్తారని ప్రచారం జరుగుతోంది. కవితకు నోటీసులు, అరెస్ట్ సమాచారం అందుకున్న కేటీఆర్, హరీష్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు.
కవిత అరెస్ట్ అక్రమమని కేటీఆర్, హరీష్ రావు ఆరోపించారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్టు చేయకూడదంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత కవితను ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని అధికారులను కేటీఆర్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను ఎందుకు తప్పుతున్నారు, తరువాత మీరు కోర్టు నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులను కేటీఆర్ హెచ్చరించారు. కావాలని శుక్రవారం వచ్చి కవితను అరెస్ట్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా కవిత ఇంట్లోకి రావద్దు అంటూ హుకూం ఎలా జారీ చేస్తారంటూ మండిపడ్డారు.
మరిన్ని చూడండి