Loksabha Elections 2024: కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో కరీంనగర్ పార్లమెంటరీ స్థానంపై జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గతంలో ఉద్యమ సమయంలో కేసీఆర్, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అనూహ్యంగా బీజేపీ టికెట్ దక్కించుకొన్న బండి సంజయ్ కుమార్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే నేడు అదే పార్లమెంటు స్థానానికి అభ్యర్థి ఎంపిక ప్రతిపక్ష పార్టీలకు కత్తిమీద సాములా మారింది. నిన్నటివరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాత అభ్యర్థి వినోద్ కుమార్ కు టికెట్ ఇస్తుందా లేకుంటే మరొకసారి పడిపోయిన గ్రాఫ్ ని నిలబెట్టుటకు కేసీఆర్ నేరుగా బరిలో దిగుతారా? అని ఆసక్తి నెలకొంది.
బండి సంజయ్ పాదయాత్ర..
ఇక పార్టీల పరంగా అభ్యర్థులను పరిశీలిస్తే సిట్టింగ్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అయినా బండి సంజయ్ కుమార్ ఉన్నారు. ఆ తరువాత పార్టీలో సుగుణాకర్ రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఈటెల రాజేందర్ రూపంలో తనకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించి, ఇప్పటికే తన అభ్యర్థిత్వం ఖరారు అయిందని సంకేతాలు ఇస్తూ, పార్టీలో కేడర్లో ఉత్సాహం నింపడానికి బండి పాదయాత్ర నిర్వహించారు.
కాంగ్రెస్ నుంచి ఎవరికి ఛాన్స్
ఇక రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా బీజేపీకి చెక్ పెట్టాలని ఉద్దేశంతో బీసీ నినాదంతో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన రుద్ర సంతోష్ కు కాంగ్రెస్ పెద్దలు టికెట్ కేటాయించాలని ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే యువకుడు, సాఫ్ట్‌వేర్ రంగం మీద మంచి అవగాహన ఉన్న రుద్ర సంతోష్ కు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆశీస్సులు ఉండడం, కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో బీసీలలో అధిక శాతం మున్నూరు కాపులు, గౌడ ఓటర్లు ఉండడం కాంగ్రెస్ అభ్యర్థికి కలిసొచ్చే అంశాలు.
మరోవైపు పొన్నం ప్రభాకర్ కోసం తన ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని ఎంపీగా బరిలో నిలబడడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారంగా తెలుస్తోంది. అయితే కరీంనగర్ పార్లమెంటులో ఇప్పటివరకు తన సామాజిక వర్గం నుంచి ఎంపీగా గెలిచిన దాఖలాలు లేకపోవడం, హిందుత్వ ఎజెండాతో ముందుకు వస్తున్న బీజేపీని నిలువరించడం సాధ్యం కాకపోతే తన రాజకీయ భవిష్యత్తు శూన్యంలోకి నెట్టి వేసినట్లేనని.. అందుకే తాను సుముఖంగా లేనని ప్రవీణ్ రెడ్డి తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు సమాచారం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సహించడం వలన తనకు ఒక స్పష్టమైన హామీ లభిస్తే.. పోటీ చేయడానికి సిద్ధంగా ఉండే ఛాన్స్ ఉంది.
కాంగ్రెస్ నుంచి వెళ్లి టికెట్ ఆశిస్తున్న చేస్తున్న మరో అభ్యర్థి వేలిచాల రాజేందర్ రావుకు తన సామాజిక అండదండలు, ఆర్థికంగా చాలా బలంగా ఉండడం కలిసి వచ్చే అంశాలు. పార్టీలో కానీ, క్యాడర్లో కానీ ఏ నాయకులతో సన్నిహిత సంబంధాలు లేకపోవడం, కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే తెరమీదికి రావడం తన టికెట్టు ఖరారును ప్రభావితం చేయనున్నాయి. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం, అయోధ్య రామ మందిరం ప్రారంభం చేసి తర్వాత తెలంగాణలో హిందూ సమాజానికి తానే ఒక ప్రతినిధిని అనే విధంగా ప్రభావితం చేస్తున్న బండి సంజయ్ కుమార్ ని ఓడించడానికి, కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ మార్క్ రాజకీయాలను మరోసారి తెలంగాణలో చూపించడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఈసారి కరీంనగర్ ఎంపీ స్థానాన్ని ఢిల్లీకి బహుమతిగా పంపిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పట్టుదలతో ఉంది. ఏది ఏమైనా కరీంనగర్ పార్లమెంటు స్థానానికి అన్ని పార్టీలలో వర్గ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకలు చర్చించుకుంటున్నారు.
మరిన్ని చూడండి